Stroke Deaths Worldwide : బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించే వారి సంఖ్య 2050 నాటికి 10 మిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ లాన్సెట్. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీనికోసం ఏడాదికి 2.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయని వెల్లడించింది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. 2020లో 6.6 మిలియన్లు ఉండగా.. అది 2050 నాటికి 9.7 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రపంచ స్ట్రోక్ ఆర్గనైజేషన్‌తో కలిసి సంయుక్తంగా అధ్యయనం చేసింది లాన్సెట్ న్యూరాలజీ కమిషన్. ఇటీవల సర్వేలు, నిపుణులైన వైద్యులతో ఇంటర్వ్యూలు చేసి ఈ నివేదికను ప్రచురించింది.
Latest Lancet Report On Stroke : గత 30 ఏళ్లలో బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించే, వైకల్యం పొందే వ్యక్తుల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఈ నివేదికలో వివరించింది. 2020లో బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు అత్యధికంగా ఆసియాలో 61 శాతం ఉండగా.. 2050 నాటికి 69 శాతానికి పెరుగుతాయని చెప్పింది. బ్రెయిన్ స్ట్రోక్ మరణాలను ఎదుర్కొవడానికి 12 సూచనలను చేసింది. ఈ మరణాల నివారణకు ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని కల్పించాలని చెప్పింది. ఇందుకోసం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని శిక్షణ, అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని తెలిపింది. ఈ మరణాలను ఎదుర్కొడానికి సరిపడా వైద్య సిబ్బంది, మందులు, మౌళిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సరైన జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే మరణం ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెప్పింది.
ఉష్ణోగ్రతలు మరో 2డిగ్రీలు పెరిగితే గుండెపోటు
ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కంటే 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే ఉత్తర భారత్ సహా తూర్పు పాకిస్థాన్‌లోని ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ నివేదిక వెల్లడించింది. దీని వల్ల దాదాపు 220 కోట్ల మంది ప్రజలు అతి తీవ్ర వేడిని ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ నివేదికను ప్రచురించింది. ఈ అతి తీవ్రమైన వేడి వల్ల మానవుల్లో వడదెబ్బ, గుండెపోటుతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.