Sri Lanka crisis: అరుదైన వాణిజ్య పంటలు... ప్రపంచంలోనే అత్యంత భారీ రబ్బరు తోటలు... నాణ్యమైన టైర్ల ఉత్పత్తి... దక్షిణాసియాలో అత్యధిక ఆదాయం ఆర్జించే ఓడ రేవు... అడుగడుగునా ఇనుమడించిన ప్రకృతి రమణీయత పర్యటకుల రూపంలో కురిపించే భారీ విదేశీ మారకద్రవ్యంతో ఒకప్పుడు 'సిరి'లంకగా భాసిల్లిన సిలోన్- ఇప్పుడు తన ప్రాభవం కోల్పోయింది! రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా 2014 నుంచి పతనమవుతూ వచ్చిన శ్రీలంక... నేడు ప్రజలకు నిత్యావసరాలను అందించలేని దుస్థితికి చేరింది. ఆకలి మంటల్లో పుట్టిన ఉద్యమ సెగలు అధ్యక్ష భవనాన్ని తాకాయి. ఈ క్రమంలోనే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశంలో 'ఎమర్జెన్సీ' విధించారు. అసలు శ్రీలంకకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
Sri Lanka tourism covid effect: పర్యటకం ద్వారా శ్రీలంకకు భారీగా విదేశీ ద్రవ్యం సమకూరేది. కొవిడ్ మహమ్మారి పుణ్యమాని ఈ రంగం ఘోరంగా దెబ్బతింది. కరోనా కారణంగా శ్రీలంక రెండేళ్లలో 14 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయింది. తద్వారా ఆర్థిక లోటు 1.5% పెరిగిపోయింది. ఈ నిధులు అడుగంటడం, ఆదాయం లేకపోవడం వల్ల చమురు, ఆహార పదార్థాలు, ఔషధాలు, నిర్మాణ సామగ్రి, నిత్యావసరాలను సమకూర్చడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. రోజులు గడిచేకొద్దీ వీటి నిల్వలు తరిగి, ధరలు అమాంతం పెరిగిపోయాయి. పరిస్థితులు కుదుటుపడుతున్న సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగిపోవడం... శ్రీలంకకు గోటి చుట్టుపై రోకటి పోటులా పరిణమించింది. ఈ ఏడాది జనవరి నాటికి శ్రీలంక వద్ద కేవలం 2.3 బిలియన్ డాలర్ల మేర మాత్రమే విదేశీ ద్రవ్య నిల్వలు ఉన్నాయి. దేశీయ అవసరాలకు తగిన దిగుమతులు చేసుకోవడానికి ఇవి ఏమాత్రం సరిపోవు. మార్చి వచ్చేసరికి రోజువారీ అవసరాలకు చమురు సమకూర్చుకునే పరిస్థితులు కూడా లేకపోయాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తూ, నిత్యావసరాల కోసం గంటల తరబడి బారులుతీరి ఎదురు చూస్తున్నా... ఆహారం దొరకడం గగనమే అవుతోంది.
చేపల వేటకు డబ్బుల్లేవు...: శ్రీలంక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లాలంటే... ఒక మర పడవకు సుమారు రూ.2.75 లక్షల విలువైన ఇంధనం అవసరమవుతోంది. కానీ ఇప్పుడు దేశాన్ని ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక మరో ప్రధాన ఆదాయ వనరైన తేయాకు ఉత్పత్తి 13 సంవత్సరాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. తేయాకు ఎగుమతుల ద్వారా శ్రీలంకకు ఏటా 1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం సమకూరేది. నిధుల లేమితో పలు దేశాల్లోని దౌత్య కార్యాలయాలను శ్రీలంక మూసివేస్తోంది. ఆదాయం కోసం ప్రభుత్వం రైలు ఛార్జీలను, పన్నులను భారీగా పెంచింది. దీంతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్రీలంకలో విద్యుదుత్పత్తి తీవ్ర సంక్షోభంలో పడింది. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల 14 స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాల్లోని పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఫలితంగా 5 లక్షల మందికిపైగా కార్మికుల ఉపాధి గాలిలో దీపంలా మారింది. కరెంటు కోతల కారణంగా టీవీ ప్రసారాలు తక్కువ సమయమే ఉండటం వల్ల ప్రకటనలు నిలిచిపోయి, దృశ్య శ్రవణ మాధ్యమాలు తీవ్ర నష్టాల్లోకి జారుకుంటున్నాయి. ఆన్‌లైన్ విద్యకు కూడా ఇక్కట్లు తప్పలేదు.
ఒక డాలరుకు 270 శ్రీలంక రూపాయలు: శ్రీలంక రూపాయి దారుణంగా పతనమవుతోంది. ఈ ఏడాది మార్చి 21 నాటికి... ఒక అమెరికన్ డాలరుకు శ్రీలంక రూ.270, యూరోకు రూ.298, బ్రిటిష్ పౌండుకు రూ.355, ఆస్ట్రేలియా డాలరుకు రూ.199, సింగపూర్ డాలరుకు రూ.199, స్విస్ ఫ్రాంక్‌కు రూ.289, భారతదేశ రూపాయికి రూ.3.50 చెల్లించాల్సి వస్తోంది.
మొహం చాటేసిన డ్రాగన్: రోజులను నెట్టుకొచ్చేందుకు శ్రీలంక అప్పులు చేయక తప్పడం లేదు. శ్రీలంక విదేశీ మారక నిల్వలు 2.3 బిలియన్ డాలర్లే ఉన్నా, కొలంబోకు ఈ ఏడాది 6.9 బిలియన్ డాలర్ల సాయం అందించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంగీకరించింది. కష్టంలో ఉన్నామని, తమను ఆదుకోవాలని శ్రీలంక చైనాను అభ్యర్థించినా... ఆ దేశం మొహం చాటేసింది. ఈ క్రమంలోనే శ్రీలంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స... భారత్‌లో పర్యటించారు. నిత్యావసరాలు, అత్యవసర ఔషధాలను సమకూర్చుకునేందుకు ఒక బిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక సాయం కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం వల్ల ఆ దేశానికి పెద్ద ఊరటే లభించింది. కొలంబో అంతర్జాతీయ ఓడ రేవు ద్వారా భారత్ చేసే 1.12 బిలియన్ డాలర్ల వాణిజ్యమే ఇప్పుడు శ్రీలంకకు ప్రధాన ఆదాయ వనరు కావడం విశేషం. శ్రీలంక భారత్‌ను కాదని చైనాకు దగ్గరవుతోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావించినా... కష్టకాలం మాత్రం అది తప్పని నిరూపించింది.
భారత బలగాలను రప్పించలేదు: తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా చెలరేగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం భారత బలగాల సాయం తీసుకుంటున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. భారత సైనికులు ఇప్పటికే కొలంబో చేరుకున్నారంటూ కొన్ని ఫొటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, శ్రీలంక రక్షణశాఖ వీటిని కొట్టి పారేసింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడే సామర్థ్యం స్థానిక బలగాలకు ఉందని రక్షణశాఖ కార్యదర్శి కమల్ గుణరత్నే పేర్కొన్నారు. ఎంతటి పరిస్థితినైనా వారు సమర్థంగా ఎదుర్కోగలరని చెప్పారు. ఏడాది కిందట సంయుక్త భద్రతా విన్యాసాల నిమిత్తం భారత సైనికులు కొలంబో వచ్చారని, అప్పటి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారత బలగాలు శ్రీలంక వచ్చాయన్న కథనాలను భారత హైకమిషన్ కూడా కొట్టిపారేసింది. ఇవన్నీ పూర్తి నిరాధారమైన, తప్పుడు కథనాలని పేర్కొంది.
ఇదీ చదవండి: లంకలో రాజకీయ సంక్షోభం.. భారత్ ఇంధన సాయం