china sri lanka ship భారత్ తీవ్రంగా అభ్యంతరం చెబుతున్నప్పటికీ.. చైనా పరిశోధక నౌక 'యువాన్ వాంగ్'కు అనుమతిస్తూ శ్రీలంక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. బాలిస్టిక్ క్షిపణులు, అంతరిక్షం, ఉపగ్రహాలపై నిఘా వేయగలిగే అధునాతన సాంకేతిక హంగులున్న ఈ నౌకను హంబన్‌టొటా పోర్టులో నిలిపేందుకు శనివారం అనుమతించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం గురువారమే ఈ నిఘా నౌక శ్రీలంకలోని హంబన్‌టొటా పోర్టుకు చేరాల్సి ఉంది. ఈనెల 17 వరకు అక్కడ నిలపాలని నిర్ణయించగా.. భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భారత సైనిక వ్యవస్థలు, కీలక కార్యకలాపాలపై ఆ నౌక 'గూఢచర్యం' చేసే అవకాశాలున్నాయంటూ గట్టిగా నిరసన తెలిపింది. ఈమేరకు నౌక రాకను వాయిదా వేయాల్సిందిగా శ్రీలంక చైనాను కోరింది.
దీంతో నౌక గురువారం రానప్పటికీ తాజాగా ఈనెల 16 నుంచి 22 వరకు హంబన్‌టొటాలో నిలిపేందుకు అనుమతించినట్లు శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని, అన్ని దేశాల న్యాయబద్ధమైన ప్రయోజనాలను కాపాడటమే తమ ఉద్దేశమని పేర్కొంది. శ్రీలంక ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్) పరిధిలో ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్)ను క్రియాశీలంగా ఉంచుతామని, తమ ప్రాదేశిక జలాల్లో ఎలాంటి శాస్త్రీయ పరిశోధనలు జరపడానికి వీల్లేదని ఈ సందర్భంగా రక్షణ శాఖ షరతులను విధించినట్లు పేర్కొంది. ఇంధనం, సరకులు నింపుకోవడానికే పంపుతున్నట్లు చైనా చెబుతున్న ఈ నౌక ప్రస్తుతం హంబన్‌టొటాకు తూర్పున 600 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. తాజాగా శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలోనూ తీవ్ర వివాదాస్పదమైంది. ఈ విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేకపోయిందంటూ ప్రతిపక్షం ధ్వజమెత్తింది.
శ్రీలంకలో హంబన్‌టొటా వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతం. ఈ పోర్టును చాలామేర చైనా రుణాలతో అభివృద్ధి చేశారు. కాగా భద్రత, ఆర్థిక ప్రయోజనాల రీత్యా చైనా నిఘా నౌకకు సంబంధించి పరిణామాలను అత్యంత అప్రమత్తంగా పరిశీలిస్తున్నట్లు భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నౌక 750 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. ఫలితంగా కల్పకం, కూడంకుళం సహా అణు పరిశోధన కేంద్రాలు దీని పరిధిలోకి వచ్చేస్తాయి. దీంతోపాటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా నేత్రం ఉంచగలదు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన సంస్థల కీలక సమాచారాన్నీ సేకరించగలదు. ఈ నేపథ్యంలోనే భారత్ అనేక అనుమానాలను, అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది.
ఇవీ చదవండి: తన చుట్టూ ఉండే సెక్యూరిటీని చూసి సల్మాన్ రష్దీ అసహనం
కరవు కథాచిత్రం.. ఎండిన నదులు, చెరువులు.. 500 ఏళ్లలో లేని దుర్భర పరిస్థితులు