South Korea Fire: దక్షిణ కొరియాలోని ఓ భవనంలో చెలరేగిన మంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. డేగు నగరంలోని ఓ కార్యాలయ భవనంలో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే గదిలో ఉన్నారని వెల్లడించారు.
Office building Fire SKorea: సహాయక చర్యల కోసం పదుల సంఖ్యలో అగ్నిమాపక దళాలను మోహరించినట్లు డేగు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు వీరంతా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కోర్టు సమీపంలో ఉన్న భవనం రెండో ఫ్లోర్లో చెలరేగిన ఈ మంటల్లో.. 41 మంది గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రుల్లో చాలా మంది పొగ పీల్చడం వల్ల అస్వస్థతకు గురయ్యారని వివరించారు.
![south korea office building fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15511829_fire-2.jpg)
కావాలనే నిప్పు పెట్టి...
ఘటనకు గల కారణాలు తెలియలేదు. అయితే, ఓ దుండగుడు కావాలనే భవనానికి నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. న్యాయవాది కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ ఘటనకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి సైతం మంటల్లో కాలిపోయాడని పోలీసు అధికారి జియోంగ్ హెయోన్ వూక్ తెలిపారు. 'నిందితుడు చేతిలో ఏదో కంటైనర్ పట్టుకొని తన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దృశ్యాలను గుర్తించాం. కంటైనర్లో మంటలను వ్యాప్తి చేసే పదార్థాలు ఉండొచ్చు. మృతులంతా ఒకే గదిలో ఉన్నారు. నిందితుడు ఈ ఘటనకు పాల్పడటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం' అని వివరించారు.
![south korea office building fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15511829_fire-1.jpg)
డేగు నగరంలో గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. కుట్రపూరితంగా ఓ రైలుకు నిప్పు పెట్టడం వల్ల 192 మంది ప్రాణాలు కోల్పోయారు. 2003లో ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి: