Syria Boat Capsized: లెబనాన్ నుంచి సిరియా వెళుతున్న వలసదారుల పడవ బోల్తాపడిన ఘటనలో చిన్నపిల్లలు సహా 86 మంది మరణించారు. మృతిచెందిన వారంతా లెబనాన్, సిరియా దేశాలకు చెందినవారని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో పడవలో 150 మందికిపైగా ఉన్నట్లు తెలిపారు.
దాదాపు 50 మందికిపైగా గల్లంతు కాగా, 20మంది సిరియాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు ప్రకటించారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు సిరియాకు చెందిన అధికారి వెల్లడించారు. మెడిటెర్రేనియన్ తీరంలో జరిగిన అత్యంత దారుణమైన దుర్ఘటనల్లో ఇదొకటని అధికారులు చెప్పారు.
లెబనాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా బతుకులు దుర్బరంగా మారడం వల్ల అక్కడి ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. లెబనాన్‌లో 90శాతం మందికి ఉద్యోగాలు లేకపోవడం అక్కడి దారుణ పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. బతకడం కన్నా సముద్రంలో పడిచావడమే మేలని పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లెబనాన్‌లో బతుకు భారం కావడం వల్ల లక్షలాది మంది చిన్నచిన్న పడవల సాయంతో సముద్రం దాటుతూ ప్రమాదాలకు లోనవుతున్నారు.
ఇవీ చదవండి: అవినీతి నేతలపై జిన్పింగ్ ఉక్కుపాదం.. ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష
ఐరాస వేదికగా పాక్ ప్రధాని కుయుక్తులు.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్