SCO Summit Modi Putin : షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సభ్య దేశాల అగ్రనేతల శిఖరాగ్ర సదస్సు గురువారం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో ప్రారంభం కానుంది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఈ నేతలందరూ ముఖాముఖి సమావేశం కానుండడం ఇదే ప్రథమం. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు చర్చకు రానున్నాయి. 2001లో ప్రారంభమైన ఎస్‌సీవోలో 8 దేశాలు.. చైనా, కజక్‌స్థాన్, కిర్గిజిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, భారత్, పాకిస్థాన్‌లకు పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. భారత్, పాక్‌లు 2017లో పూర్తిస్థాయి సభ్యులయ్యాయి. ఎస్‌సీవోలో పరిశీలక దేశాలుగా.. అఫ్గానిస్థాన్, బెలారస్, మంగోలియా కొనసాగుతున్నాయి.
కంబోడియా, నేపాల్, శ్రీలంక, తుర్కియే, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లు చర్చల్లో భాగస్వామ్య హోదాను కలిగి ఉన్నాయి. భారత ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే వేదికను పంచుకోనుండడం ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకత. కొవిడ్ విజృంభణ తర్వాత అగ్రనేతలు నేరుగా ఒకేచోట కలుసుకోవడం ఇదే తొలిసారి. 2020లో మాస్కోలో జరిగిన ఎస్‌సీవో సదస్సుకు నేతలందరూ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. 2021లో దుషాంబే శిఖరాగ్ర సదస్సు హైబ్రిడ్ (వర్చువల్+భౌతిక హాజరు)విధానంలో జరిగింది.
ద్వైపాక్షిక భేటీలకు అవకాశం ఉందా?
ఎస్‌సీవో సదస్సులో పాల్గొంటున్న అగ్రనేతలు పనిలో పనిగా ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశాలున్నాయి. అయితే, భారత్-పాక్; భారత్-చైనా నేతల మధ్య ఈ సందర్భంగా చర్చలకు అవకాశం ఉంటుందా అనే విషయమై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని క్రెమ్లిన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, ఐక్యరాజ్య సమితి, జి-20లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలు వీరి అజెండాలో ఉండే అవకాశం ఉంది. డిసెంబరులో ఐరాస భద్రతా మండలికి, 2023లో జీ-20, ఎస్‌సీవోకు భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఎంతో కీలకమైనదిగా క్రెమ్లిన్ పేర్కొంది. అయితే మోదీ, పుతిన్ విడిగా సమావేశం కావడంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
- ఎస్‌సీవో సదస్సుకు హాజరయ్యే విషయాన్ని చివరి క్షణంలో నిర్ధారించడంతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పాల్గొనడంపై నెలకొన్న సందేహాలు తొలగిపోయాయి. కజక్‌స్థాన్ పర్యటనలో ఉన్న జిన్‌పింగ్ అటు నుంచి ఉజ్బెకిస్థాన్‌కు వస్తున్నట్లు స్వయంగా వెల్లడించడం విశేషం. తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద పెట్రోలింగ్ పాయింట్-15 నుంచి భారత, చైనా బలగాలు వెనక్కి మళ్లిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొంత వరకు సడలింది. ఈ పరిస్థితుల్లో మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
- సదస్సు సందర్భంగా భారత్, పాక్ ప్రధానులు పరస్పరం ఎదురుపడితే మర్యాద పూర్వకంగా పలకరించుకోవడం మినహా రెండు దేశాల నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇవీ చదవండి: పది సంవత్సరాలు కట్టిన కట్టడం.. లంకకు తెల్ల ఏనుగులా మారనుందా?
బ్రిటన్ రాణి అంత్యక్రియలకు ముర్ము.. రాష్ట్రపతిగా తొలి విదేశీ పర్యటన