Sanctions On Russia: నిరాయుధుల్ని, మహిళల్ని, చివరకు పిల్లలను సైతం ఏమాత్రం కనికరించకుండా రష్యా హతమారుస్తోందని ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ దేశం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదన్నాయి. ఇప్పటికే విధించిన ఆంక్షలకు అదనంగా ఐదో విడతలో మరికొన్నిటితో రష్యాను ఉక్కిరిబిక్కిరి చేయాలని నిర్ణయించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తెలిద్దరికీ ఇవి తప్పవని అమెరికా సహా కొన్ని దేశాలు తేల్చిచెప్పాయి. కొత్తగా నాలుగు రష్యా బ్యాంకుల లావాదేవీలను కఠినతరం చేయనున్నాయి. తమ ఆర్థిక వ్యవస్థలోకి అడుగుపెట్టనీయకుండా వాటిపై నిషేధం విధించాయి. అమెరికా పౌరులు ఈ బ్యాంకులతో లావాదేవీలు చేయకుండా, ఆ దేశంలో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకట్ట పడింది. పుతిన్ కుటుంబంపైనే కాకుండా ప్రధాని మిఖైల్ మిషుస్తిన్ కుటుంబం, విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, రష్యా భద్రతా మండలి సభ్యులు తదితరులనూ ఆంక్షల చట్రంలోకి తెచ్చినట్లయింది. పుతిన్ సన్నిహితులకు అమెరికాలో ఉన్న ఆస్తుల్ని స్తంభింపజేస్తారు. ఐరాస మానవ హక్కుల కమిషన్ నుంచి రష్యాను సస్పెండ్ చేయాలన్న తీర్మానంపై సర్వ ప్రతినిధి సభ గురువారం ఓటింగ్ నిర్వహించనుంది. దీని కోసం అత్యవసరంగా సమావేశం కానుంది. మరికొన్ని ఐరోపా దేశాలు రష్యా దౌత్యవేత్తల్ని బహిష్కరించాయి. బొగ్గు దిగుమతులు సహా ఐదో విడత కింద మరిన్ని ఆంక్షల్ని పరిశీలిస్తున్నట్లు యూరోపియన్ కమిషన్ తెలిపింది. రష్యా నౌకల్ని, ఆ దేశ నిర్వహణలో ఉన్న ఓడల్ని ఈయూ రేవుల్లోకి రానివ్వకుండా నిషేధాన్ని విధించాలని తీర్మానించారు. బుచాలో జరిగిన మారణహోమంపై విచారణ జరపాలని చైనా డిమాండ్ చేసింది.
- 'ఆర్థిక పతనం అంచున రష్యా'.. 10 కోట్ల డాలర్ల విలువైన జావెలిన్ క్షిపణుల్ని ఉక్రెయిన్‌కు పంపడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంగీకరించారు. దీంతో కలిపి 240 కోట్ల డాలర్ల సాయాన్ని అగ్రరాజ్యం అందించినట్లవుతుంది. యుద్ధానికి కావాల్సిన నిధుల్ని సమీకరించుకోవడం పుతిన్‌కు రోజురోజుకీ కష్టతరమవుతోందని శ్వేతసౌధం పేర్కొంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ.. పతనం అంచున ఉందని తెలిపింది.
- బుచాలో మరిన్ని దారుణాలు వెలుగుచూశాయి. కాలిపోయి, పేరుకుపోయిన మృతదేహాలు అక్కడి ఘోరానికి నిదర్శనంగా మిగిలాయి. కణతలకు తుపాకీ ఎక్కుపెట్టి కాల్చినట్లు పలు మృతదేహాలపై ఆనవాళ్లు ఉన్నాయి.
ఊచకోతను ఖండించిన పోప్.. ఉక్రెయిన్‌లోని బుచాలో ప్రజల్ని ఊచకోత కోయడాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఖండించారు. అత్యంత మారణహోమాన్ని చవిచూసిన బుచా నగరం నుంచి పంపిన ఉక్రెయిన్ జెండాను ఆయన ప్రేమతో ముద్దాడి, అక్కడి ప్రజలకు సంఘీభావం తెలిపారు. వాటికన్ ఆడిటోరియంలో వారపు సందేశాన్ని వెలువరిస్తూ ఆయన ప్రసంగించారు. మరకలు పడి, నలిగిపోయిన జెండాను ఆయన ప్రేమతో ప్రదర్శించగానే వేలమంది ప్రజలు కరతాళ ధ్వనులు చేశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ముగ్గురు బాలల్ని చూపిస్తూ.. వారిని, ఆ దేశ ప్రజల్ని మరిచిపోకూడదని కోరారు. ఉక్రెయిన్ యుద్ధంలో ఐరాస చేతకానితనాన్ని చూస్తున్నామని విమర్శించారు.
ఇదీ చదవండి: 'జెలెన్స్కీ అందుకు ఒప్పుకుంటే యుద్ధం ఆపేస్తాం'