Russia Military mobilisation: రష్యాకు సైనిక సమీకరణ తిప్పలు తప్పడం లేదు! పుతిన్ ప్రకటన మొదలు ఇప్పటికే వేలమంది రష్యాను వీడగా.. ఇక్కడున్న వారిలోనూ అర్హుల ఎంపిక కష్టతరమవుతోంది. తాజాగా ఇక్కడి ఖబరోవ్స్క్ ప్రాంతం నుంచి సైన్యంలో చేరేందుకు పిలుపు వచ్చిన వేలమందిని అధికారులు వెనక్కు పంపారు. కారణం.. వారు ఆర్మీ కనీస ప్రమాణాలు అందుకోకపోవడమే. ఈ క్రమంలోనే స్థానిక మిలిటరీ కమిషనర్‌ను తొలగించడం గమనార్హం. 'ఖబరోవ్స్క్ మిలిటరీ కమిషనర్ యూరి లైకో సస్పెండ్ అయ్యారు. అయితే, సైనిక సమీకరణ ప్రక్రియపై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదు' అని గవర్నర్ మిఖాయిల్ డెగ్తియారోవ్ సోమవారం వెల్లడించారు.
మిలిటరీ కమిషనర్ తొలగింపునకు డెగ్తియారోవ్ ప్రత్యేక కారణాలు పేర్కొనలేదు. కానీ, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో తప్పిదాలను ఆయన ప్రస్తావించారు. 'గత 10 రోజుల వ్యవధిలో ఈ రీజియన్ నుంచి వేలమంది.. సైనిక నమోదు కార్యాలయాలకు చేరుకున్నారు. కానీ, దాదాపు సగం మంది.. ఎంపిక ప్రమాణాలను అందుకోలేదు. ఈ నేపథ్యంలో అధికారులు వారిని తిరిగి ఇంటికి పంపారు' అని వివరించారు. అధ్యక్షుడు, రక్షణశాఖ ఆమోదించిన వర్గాలను మాత్రమే ఎంపిక చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలోనే.. ఖబరోవ్స్క్ మిలిటరీ కమిషనర్‌పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసేందుకు.. సైనిక అనుభవం, సంబంధిత నైపుణ్యాలు గల మూడు లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ చేపట్టాలంటూ పుతిన్ ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ.. విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులకూ సమన్లు అందుతున్నాయి. మరోవైపు.. దీన్ని తప్పించుకునేందుకు భారీ సంఖ్యలో ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రష్యా నుంచి వెళ్లే విమానాలు ప్రయాణికులతో నిండిపోతున్నాయి.
ఇవీ చదవండి: హిజాబ్ ఆందోళనలకు కారణం ఆ రెండు దేశాలే.. మౌనం వీడిన ఇరాన్ సుప్రీం