Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై సైనిక చర్య క్రమంలోనే నాటోలో చేరవద్దని స్వీడన్, ఫిన్లాండ్‌లను రష్యా హెచ్చరించింది. బహిరంగంగా, దౌత్య మార్గాల ద్వారా ఆ రెండు దేశాలను హెచ్చరించినట్ట రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా జఖరోవా బుధవారం వెల్లడించారు. "స్వీడన్, ఫిన్లాండ్‌లకు బాగా తెలుసు. దీని గురించి వారు ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నాటోలో చేరితే ఏమవుతుందో వారికి పూసగుచ్చినట్టు చెప్పాం" అని మారియా చెప్పారు. నాటో సభ్యత్వం తీసుకునే విషయమై ఫిన్లాండ్ పార్లమెంటులో చర్చ జరుగుతున్న క్రమంలో రష్యా ఈ హెచ్చరికలను జారీచేయడం గమనార్హం. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో.. నాటో సైనిక కూటమిలో చేరాలని ఫిన్లాండ్ సర్కారుపై ప్రజల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి.
ఆగని శరణార్థుల వెల్లువ: ఉక్రెయిన్‌లో ఎనిమిది వారాల నుంచి జరుగుతున్న యుద్ధం.. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఎన్నడూ ఎరుగని శరణార్థి సంక్షోభాన్ని ఐరోపాలో సృష్టించింది. ఉక్రెయిన్ జనాభా 4 కోట్లలో బుధవారం నాటికి 50 లక్షల మంది పొరుగుదేశాలకు శరర్జుణార్థులుగా తరలిపోయారని 'ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ' వివరించింది. ఉక్రెయిన్‌లోనే మిగిలిపోయినవారిలో 70 లక్షల మంది యుద్ధం వల్ల ఇళ్లూ వాకిళ్లూ కోల్పోయి దారీతెన్నూ తెలియని స్థితిలో ఉన్నారు. మొత్తంమీద ఉక్రెయిన్ జనాభాలో నాలుగో వంతు మంది నిరాశ్రయులై చెల్లాచెదురయ్యారు. దేశం విడిచి వెళ్లిన శరణార్థుల్లో 28 లక్షలమంది మొదట పోలండ్‌కు చేరుకున్నారు. అక్కడ ఉపాధి, విద్యా, వైద్య వసతులు పొందడానికి చాలామందికి గుర్తింపు కార్డులు లభించాయి. దాడులను రష్యా ముమ్మరం చేస్తున్నందున శరణార్థుల ప్రవాహం మరింత పెరగనున్నదనీ, వారిని ఆదుకోవడానికి అంతర్జాతీయ సహాయం కావాలని ఐరోపా దేశాలు కోరుతున్నాయి.
రష్యాకు ఎంఎఫ్‌ఎన్ హోదాను రద్దు చేసిన జపాన్: తమతో వాణిజ్యం పరంగా రష్యాకు ఉన్న 'అత్యంత ప్రాధాన్య దేశం' (ఎంఎఫ్‌ఎన్) హోదాను జపాన్ పార్లమెంటు బుధవారం లాంఛనంగా రద్దు చేసింది. ఉక్రెయిన్ దురాక్రమణకు రష్యా ప్రయత్నిస్తుండడాన్ని నిరసిస్తూ విధిస్తున్న ఆంక్షల్లో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు ప్రకటించింది. రష్యాకు చెందిన ఎనిమిది మంది దౌత్య, వాణిజ్య అధికారుల్ని జపాన్ గత నెలలోనే బహిష్కరించింది. వారంతా బుధవారం తమ దేశానికి బయల్దేరారు. తాజాగా ఎంఎఫ్‌ఎన్ రద్దుతో రష్యా నుంచి జపాన్‌కు జరిగే దిగుమతుల ధరవరలపై ప్రభావం పడనుంది. విదేశీ మారకద్రవ్య చట్ట నిబంధనల్ని కూడా పార్లమెంటు సవరించింది. రష్యా చేస్తున్న దురాక్రమణ ప్రభావం తూర్పు ఆసియా పైనా పడవచ్చనే ఉద్దేశంతో దానిని నిలువరించేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రయత్నాలకు జపాన్ గట్టి మద్దతునిస్తోంది. రష్యాతో కొత్తగా పెట్టుబడుల్ని, వాణిజ్యాన్ని నిషేధించింది.
పుతిన్, జెలెన్‌స్కీలతో చర్చించాలని ఉంది: ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పడానికి కావాల్సిన అత్యవసర చర్యలపై చర్చించడానికి తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో ఆయా, దేశాల్లో చర్చించాలనుకుంటున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. ఈ మేరకు ఆ ఇద్దరు నేతలకు ఆయన విడివిడిగా లేఖలు రాశారని సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి తెలిపారు.
ఇదీ చదవండి: రష్యా గుప్పిట్లో మరియుపోల్.. 'మాకు ఇవే చివరి రోజులు'