Rahul Gandhi vs Narendra Modi : అగ్రరాజ్యం అమెరికా వేదికగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు భారత ప్రజలను భయపెడుతోందని.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ.. దేవుడికే పాఠాలు చెప్పే ఘనుడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi Bjp RSS : కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో రాహుల్ చర్చా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. 'అంతా తమకే తెలుసు అని ప్రజలను నమ్మించే వ్యక్తులు భారత్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వారు శాస్త్రవేత్తలకే శాస్త్రాన్ని చెబుతారు. చరిత్రకారులకు చరిత్రను వివరిస్తారు. సైన్యానికి యుద్ధాన్ని నేర్పిస్తారు. వారు దేవుడితో కూర్చుంటే ఆయనకే అన్నీ వివరించగల సమర్థులు. ప్రధాని నరేంద్ర మోదీ అందుకు గొప్ప ఉదాహరణ. ఒకవేళ.. మోదీ ఆ భగవంతుడి పక్కన కూర్చుంటే.. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందని దేవుడికే చెప్పగలరు. అప్పుడు భగవంతుడు కూడా తాను సృష్టించిన విశ్వం ఇదేనా అని గందరగోళానికి గురవుతారు' అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు.
"బీజేపీ ప్రజలను భయపెడుతోంది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. ప్రజలతో మమేకమయ్యేందుకు అవసరమైన అన్ని సాధనాలను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రించింది. ఒకప్పటి రాజకీయ వ్యూహాలు ఇక పనిచేయవని అర్థమైంది. అందుకే భారత్ జోడో యాత్రను చేపట్టా. నా యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. కానీ అవి ఫలించలేదు. మా యాత్రకు మరింత ఆదరణ దక్కింది. ఆ ప్రయాణంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
బీజేపీ మద్దతుదారుల నినాదాలు
ప్రవాస భారతీయులకు ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా బీజేపీ మద్దతుదారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే వారిని చూసిన రాహుల్ నవ్వుతూ స్వాగతం పలికారు. బీజేపీ మద్దతుదారులు రాహుల్ 'జోడో.. జోడో' అని అరిచారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' కాంగ్రెస్ పార్టీ అంటే అందరికి అభిమానం ఉంది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు రావాలనుకుంటారు. ఎవరైనా వచ్చి ఏం మాట్లాడినా మేం పట్టించుకోవడం లేదు. కోపగించుకోవడం లేదు. ఎవరూ ఏం చెప్పినా శ్రద్ధగా వింటాం. వాళ్లతో ప్రేమగా ఉంటాం. ఎందుకంటే అది మన స్వభావం' అని కాంగ్రెస్ నేత రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ప్రయాణికులతో సెల్ఫీలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇమ్మిగ్రేషన్ను పూర్తి చేయడానికి రెండు గంటలు వేచి ఉండాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ ప్రయాణించిన విమానంలోని ప్రయాణికులు ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారని పేర్కొన్నారు. క్యూలో మీరు ఎందుకు నిల్చున్నారని అని రాహుల్ గాంధీని ఓ ప్రయాణికుడు ప్రశ్నించగా... తాను సామాన్యుడనని.. ప్రస్తుతం ఎంపీని కాదని రాహుల్ బదులిచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Rahul Gandhi US Tour : వారం రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ మంగళవారం అమెరికా చేరుకున్నారు. 'మొహబత్ కి దుకాణ్ (ప్రేమ దుకాణాలు)' పేరుతో కాలిఫోర్నియాలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. వాషింగ్టన్, న్యూయార్క్‌లోనూ రాహుల్ పర్యటించనున్నారు. అక్కడి ప్రవాస భారతీయులతో ఆయన ముచ్చటించనున్నారు. అమెరికా చట్టసభ ప్రతినిధులు, ఇతర రంగాల ప్రముఖులతో ఆయన చర్చలు జరపనున్నారు. జూన్ 4న న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.