ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ప్రజల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న పిండిని తీసుకునేందుకు ఎగబడ్డ క్రమంలో పాకిస్థాన్‌లో తొక్కిసలాట జరిగింది. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇదే తరహా ఘటనల్లో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ పంజాబ్‌లోని సహివాల్, బహవాల్పుర్, ముజఫర్‌గఢ్, ఒఖారా ప్రాంతాల్లో తొక్కిసలాట ఘటనలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 60 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఫైసైలాబాద్, జెహానియాన్, ముల్తాన్ జిల్లాల్లోనూ తొక్కిసలాట ఘటనలు జరిగాయి.
ఆర్థికంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రంజాన్ మాసం కావడం వల్ల ప్రజలు కావాల్సిన వస్తువులు కొనకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం.. ప్రజల కోసం ఉచితంగా గోధుమ పిండి సరఫరా చేస్తోంది. ధరల బాధను తాళలేని పాక్ ప్రజలు.. ఉచితంగా లభిస్తున్న పిండి కోసం ఎగబడుతున్నారు. పంపిణీ కేంద్రాలు తక్కువగా ఉండటం, పరిమిత సమయం పాటే పిండిని ఇస్తుండటం వల్ల ప్రజలు వాటిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుండటమూ తొక్కిసలాటకు కారణమవుతోంది. ముజఫర్‌గఢ్, రహీం యార్ ఖాన్ నగరాల్లో పంపిణీ కేంద్రాలను కొందరు లూటీ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
వరుస తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మోహ్సిన్ నఖ్వి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులకు కీలక బాధ్యతలు అప్పగించారు. మంత్రులను జిల్లాలకు ఇంఛార్జ్‌లుగా నియమించారు. పంపిణీ కేంద్రాలను సందర్శించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అనూకూలంగా ఉండే సమయాల్లో పిండి పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు. ఉదయం ఆరు గంటలకే పంపిణీ కేంద్రాలను తెరవాలని ఆదేశించారు. మరోవైపు, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పలు పంపిణీ కేంద్రాలను సందర్శించారు.
మరోవైపు ఈ ఘటనపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని దొంగల సర్కారుగా అభివర్ణించారు. ప్రజల జీవితాలను మరింత దుర్భరంగా మార్చుతున్నారని దుయ్యబట్టారు.
పాకిస్థాన్‌లో ఆర్థికంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా పతనమవుతోంది. విదేశీ మారక ద్రవ్యం అడుగంటింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి ఆర్థిక సాయం కోరుతోంది. అయితే, ప్యాకేజీ కోసం ఐఎంఎఫ్ అనేక ఆంక్షలు విధిస్తోంది. తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే సాయం చేస్తామని స్పష్టం చేస్తోంది.