ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే వేదం.. చేసిందే చట్టం. ఇతర దేశాల సంస్కృతి ప్రభావం తమ దేశ పౌరులపై ఉండకూడదని టీవీ, రేడియో, శీతలపానీయాలు, దుస్తులు, హెయిర్‌స్టైల్ వంటి వాటిపై ఆ దేశంలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు. రెండు నెలల క్రితం దక్షిణ కొరియా సినిమాలు, వీడియోలు చూశారని.. ఇద్దరు విద్యార్థులకు మరణశిక్ష విధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తర కొరియాలోని ర్యాంగాంగ్ ప్రావిన్స్ ప్రాంతం చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు అక్టోబరు నెలలో దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్ డ్రామాలు చూశారని ఉత్తర కొరియా అధికారులు వారిపై నేరారోపణ చేసినట్లు కొరియన్ మీడియా కథనాలు వెల్లడించినట్లు ది ఇండిపెండెంట్ వార్తా సంస్థ పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించినందుకు వారికి మరణశిక్ష విధించి, బహిరంగంగా కాల్చి చంపినట్లు వెల్లడించింది. ఉత్తర కొరియా చట్టాల ప్రకారం దక్షిణ కొరియాతోపాటు, ఇతర దేశాలకు చెందిన సినిమాలు, డ్రామాలు, వీడియోలు చూడటం, పంపిణీ చేయడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులు మైనర్లు అయినా కిమ్ ప్రభుత్వం వారికి మరణశిక్ష విధిస్తుంది.