Monkeypox transmission: కరోనా తర్వాత ప్రపంచాన్ని భయపెడుతోన్న మరో వైరస్ మంకీపాక్స్. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. ఈనేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని పేర్కొంది. మంకీపాక్స్ ఉన్నవారు ఇతరులతో శారీరకంగా కలవడం కారణంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. తుంపర్ల ద్వారా మంకీపాక్స్ వ్యాపిస్తుందని చెప్పేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. గతంలో మంకీపాక్స్ వ్యాప్తి లేని దేశాల్లోనూ ఈ కేసులు వెలుగుచూస్తున్న మాట వాస్తవమేనని, కానీ వాటిని నివారించవచ్చు అని తెలిపారు.
WHO on Monkeypox: ఈ వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడంతోపాటు, ఇతరులను రక్షించేందుకు ఉత్తమ మార్గాలున్నాయని టెడ్రోస్ సూచించారు. ‘మంకీపాక్స్ సోకినట్లు తేలితే హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ఇతరులకు దూరంగా ఉండాలి. ఆపై ఆరోగ్య కార్యకర్తను సంప్రదించి కావాల్సిన చికిత్స తీసుకోవాలి. మంకీపాక్స్ చికిత్స కోసం యాంటీవైరల్, వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ సరఫరా పరిమితంగా ఉంది. అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఆ టీకాలు వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉత్తమ ఫలితాలనిస్తున్నాయి. వాటి సరఫరా, పంపిణీ కోసం సమన్వయ యంత్రాంగాన్ని డబ్ల్యూహెచ్‌ఓ అభివృద్ధి చేస్తోంది’ అని ఆరోగ్య సంస్థ చీఫ్ తెలిపారు. మంకీపాక్స్ నివారణకు సామూహిక వ్యాక్సినేషన్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
Monkeypox latest update: ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తంగా 29 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగుచూసినట్లు సమాచారం. ఈ వైరస్ అధికంగా వ్యాపించే ఆఫ్రికా దేశాలతోపాటు ఇతర దేశాల్లో దాదాపు 1000 కేసులు బయటపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓకు నివేదికలు అందాయి. మునుపెన్నడూ ఈ వైరస్ లేని దేశాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. మంకీపాక్స్ వల్ల ఆఫ్రికాలో మొత్తం 66 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి: డాన్‌బాస్‌పై రష్యా నిప్పుల వర్షం.. ఉపగ్రహ చిత్రాలే సాక్ష్యం!