వలసలు అనగానే కొవిడ్ సమయంలో పెట్టేబేడా సర్దుకుని, పిల్లాజెల్లాను వెంటేసుకుని కిలోమీటర్ల మేర నడుస్తూ వెళ్లిన పేద ప్రజానీకమే కళ్లముందు మెదులుతారు. కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల ఆ వలస బాటలు తగ్గి పోయాయి. కానీ ఇప్పుడు మరో వలస ఊపందుకుంది. అదే సంపన్నుల వలసలు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల వలస కొవిడ్ అనంతరం వేగంగా సాగుతోంది.
ఎవరీ సంపన్నులు..
10 లక్షల అమెరికా డాలర్లు, అంతకంటే ఎక్కువ ఆస్తిగల వారిని సంపన్న వర్గంగా పరిగణిస్తుంటారు. గ్లోబల్ కన్సల్టెంట్ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో సంపన్నుల వలసలు పెరిగాయి. గత దశాబ్దకాలంగా వీరి వలసలు పెరుగుతున్నా, కొవిడ్ సమయంలో తగ్గాయి.
ఎక్కడి నుంచి..?
ప్రపంచంలో ముఖ్యంగా రష్యా (15వేల మంది), చైనా (10వేలు), భారత్ (8వేలు) నుంచి అత్యధిక సంఖ్యలో సంపన్నులు ఇతర దేశాలకు వలస వెళ్లారు. వీటితో పాటు హాంకాంగ్, ఉక్రెయిన్, బ్రెజిల్, మెక్సికో, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా, ఇండోనేసియాల నుంచి కూడా వలసలు భారీగానే ఉన్నాయి.
ఎక్కడికి.. ఎందుకు?
బలమైన ఆర్థిక వ్యవస్థ, తక్కువ నేరాలు, సులభతరమైన పన్నులు, వ్యాపారావకాశాలు ఎక్కువగా ఉన్న దేశాలకు వీరంతా తరలుతుంటారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, అమెరికా, పోర్చుగల్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గ్రీస్, స్విట్జర్లాండ్‌లాంటి దేశాల్లో ఇతర దేశాల నుంచి సంపన్నుల వలసలు ఎక్కువగా నమోదయ్యాయి. వీటితో పాటు మాల్టా, మారిషస్, మొనాకోలకు కూడా! అన్నింటికంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 4వేల మంది, సింగపూర్‌కు 2800 మంది తరలుతున్నట్లు అంచనా. వీరిలో చాలామంది రష్యా, భారత్, ఆఫ్రికా, మధ్యఆసియా నుంచే ఉండడం గమనార్హం. కొవిడ్‌కు ముందు ఏడాదికి వెయ్యిమంది సంపన్నుల వలస చూసిన యూఏఈ ఈసారి ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. భారత్‌లో వలస వెళ్లే వారికంటే కొత్తగా సంపన్నుల జాబితాలో చేరే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 2031కల్లా వీరి సంఖ్య భారత్‌లో భారీస్థాయిలో ఉంటుందని నివేదిక అంచనా వేసింది.