అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊరట లభించింది. రెండేళ్ల నిషేధం అనంతరం ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఆయా సంస్థల మాతృసంస్థ మెటా పునురుద్ధరించింది. అమెరికా క్యాపిటల్ భవనం వద్ద హింసాత్మక చర్యలకు పాల్పడిన నిందితులను ప్రశంసించినందుకుగాను ట్రంప్ ఫేస్బుక్ ఖాతాను మెటా 2021 జనవరి 7న సస్పెండ్ చేసింది. ట్రంప్‌కు ఫేస్బుక్లో 34 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 23 మిలియన్ల ఫాలోవర్లు అన్నారు.
తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను మెటా పునరుద్ధరించడంపై డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో స్పందించారు. 'నా వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాను ఆ సంస్థ మాతృసంస్థ పునరుద్ధరించింది. నా ఖాతాను సస్పెండ్ చేయడం వల్ల ఫేస్బుక్ బిలియన్ డాలర్లు నష్టపోయింది' అని ట్రంప్ అన్నారు.
అంతకుముందు గతేడాది నవంబరులో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది. ట్విట్టర్లో పోల్ నిర్వహించిన తర్వాత ఆయన ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు.