Lanka Crisis: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక.. అవిశ్రాంత నిరసనలతో హోరెత్తుతోంది. అల్లర్లు, హింసాత్మక ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలతో దేశమంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం జరిగిన రణరంగంలోనే 8 మంది చనిపోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. హింసను విడనాడాలని, ఏకాభిప్రాయంతో రాజకీయ స్థిరత్వానికి కృషి చేయాలని అన్నారు.
శ్రీలంక కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. విదేశీమారక నిల్వలు నిండుకోగా.. విదేశాల నుంచి దిగుమతులకూ నగదు చెల్లించే పరిస్థితి లేదు. ఇది తీవ్రమైన కొరత, అధిక ధరలకు దారి తీసింది. పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, అధికార నేతలు రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మహీంద మద్దతుదారులు.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై దాడికి దిగారు. అనంతరం.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించి.. సైనిక బలగాలను మోహరించాల్సి వచ్చింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. తన ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేశారు 76 ఏళ్ల మహీంద రాజపక్స.
దేశవ్యాప్తంగా మంగళవారం పలు చోట్ల మహీంద కేబినెట్ మంత్రులతో పాటు పలువురు రాజకీయ నేతల నివాసాలను ఆందోళనకారులు తగలబెట్టారు. హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పంటించారు. అక్కడి రాజపక్స మ్యూజియంను ధ్వంసం చేశారు. కరునెగాలలోని మహీంద నివాసాన్నీ దహనం చేశారు. మహీందపై దాడి చేసేందుకు కొలంబోలోని ప్రధానమంత్రి అధికార నివాసం టెంపుల్ ట్రీస్‌కు మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరుకున్నారు. వాహనాలను తగలబెట్టి భవనం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. పరిస్థితులు చేయిదాటిపోతుండటం వల్ల.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ మహీంద, ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం తెల్లవారుజామున అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ప్రస్తుతం మహీంద, ఆయన భార్య, మరికొందరు కుటుంబసభ్యులు ట్రింకోమలీ నౌకాదళ స్థావరానికి చేరుకొని ఆశ్రయం పొందుతున్నారు.
అండగా భారత్: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ అండగా నిలుస్తోంది. తమ పొరుగుదేశంలో ప్రజాస్వామ్యం, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు, ఆర్థిక పునరుద్ధరణకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ''సన్నిహిత, చారిత్రక సంబంధాలు కలిగిన పొరుగుదేశంగా శ్రీలంకకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది. మా నైబర్‌హుడ్ ఫస్ట్ విధానానికి అనుగుణంగా ఈ ఒక్క ఏడాదిలోనే 3.5 బిలియన్ల డాలర్ల సహాయాన్ని అందించింది. ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ మొత్తాన్ని వెచ్చించింది. అత్యవసర సామగ్రి కొరతను తగ్గించేందుకు భారతీయులు ఆహారం, ఔషధాలు ఇచ్చారు'' అని విదేశాంగ శాఖ తెలిపింది.
శ్రీలంక మాజీ ప్రధాని, ఎంపీలు భారత్‌లో..? శ్రీలంక మాజీ ప్రధాని రాజపక్స సహా అధికారపక్ష నేతలకు నిరసన సెగ తగులుతోంది. దీంతో వారిలో కొందరు దేశం విడిచి భారత్ పారిపోయినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కథనాలను కొలంబోలోని భారత హైకమిషన్ ఖండించింది. ''శ్రీలంకకు చెందిన కొందరు రాజకీయ నేతలు వారి కుటుంబాలతో సహా భారత్‌కు పారిపోతున్నారని కొన్ని మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ నిరాధార, అవాస్తవమైన కథనాలు. వీటిని హైకమిషన్ తీవ్రంగా ఖండిస్తోంది.'' అని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
బలగాలను పంపట్లేదు: శ్రీలంకకు భారత్ నుంచి బలగాలను పంపుతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపైనా హైకమిషన్ స్పందించింది. "శ్రీలంకలో ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు భారత్ బలగాలను పంపిస్తోందంటూ కొన్ని మీడియాల్లో వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నాం." అని స్పష్టం చేసింది.
మరోవైపు.. కొంతమంది ఎంపీలు దేశం విడిచి వెళ్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావగా వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ప్రయత్నిస్తున్నారు. కొలంబోలోని బండారునాయికె అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో వారు చెక్‌పాయింట్‌ను ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: శ్రీలంక ప్రధాని రాజీనామా.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ.. రంగంలోకి సైన్యం