Israel Vs Hamas War 2023 : ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాద స్థావరమైన జెనిన్‌లోని అల్-అన్సార్ మసీదుపై వైమానిక దాడులు జరిపింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. పౌరులపై దాడులు జరిపేందుకు ఈ మసీదు నుంచే ఉగ్రవాదులు ప్రణాళికలు రూపొందిస్తున్నారనే సమాచారంతో ఈ దాడులకు పాల్పడింది. దీనిపై తమ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రమూకలపై ఈ దాడి జరిపినట్లు వారు పేర్కొన్నారు.
ఇద్దరు బందీలను విడిచిపెట్టిన తరువాత తామొక మానవతా సంస్థగా చెప్పుకునేందుకు హమాస్ ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. హామాస్.. ఐసిస్ కంటే దారణమైన సంస్థ అనే విషయాన్ని ప్రపంచం మరిచిపొదన్నారు. గాజా స్ట్రిప్ ప్రజలను హమాస్ రక్షణ కవచంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. పౌరుల మౌలిక సదుపాయాలపై రాకెట్లతో దాడి చేస్తోందని దుయ్యబట్టారు.
గాజాపై దాడులు పెంచేందుకు ప్రణాళికలు..
Israel Strikes Gaza : గాజాపై దాడులను మరింత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. హమాస్‌పై యుద్ధాన్ని తరువాతి దశకు తీసుకువెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకుంటుది: హెజ్బొల్లా
Israel And Hezbollah Conflict : గాజా స్ట్రిప్ దాడి చేసినప్పుడుల్లా ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకుంటుదని హెచ్చరించింది హెజ్బొల్లా. ప్రస్తుతం తాము ఈ పోరాటంలోనే ఉన్నామని హెజ్బొల్లా డిప్యూటీ లీడర్ షేక్ నయీమ్ కస్సెమ్ తెలిపారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడులు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతోంది.
అమెరికాలో యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు దారుణ హత్య..
Synagogue President Murder In US : అమెరికాలోని ఓ యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు.. హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఇంటి బయట పొడిచి చంపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలిని సమంత వోల్(40)గా అధికారులు గుర్తించారు. మిషిగన్‌లోని డెట్రాయిట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
![Israel Vs Hamas War 2023 israel and hezbollah conflict and Synagogue President Murder In Us](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-10-2023/19829408_syno.jpg)
Hamas Hostage Release : 'హమాస్ చెరలో 210 బందీలు'.. గాజాకు 200 ట్రక్కుల్లో 3వేల టన్నుల సామగ్రి!