Israel Attack On Palestine Today : ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. వేలాదిగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఒకవైపు ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతున్నా హమాస్ అంతమే లక్ష్యమంటూ గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపిన నేపథ్యంలో గాజాపై దాడులను ఇజ్రాయెల్ మరింత ఉద్ధృతం చేసింది. తాజాగా రెండు శరాణార్థ శిబిరాలపై ఇజ్రాయెల్ రక్షణ దళం వైమానిక దాడులు జరిపింది.
24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక, భూతల దాడుల్లో 187మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. యుద్ధం మెుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు గాజాలో 85శాతం మంది పాలస్తీనా ప్రజలు వలస వెళ్లారు. శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేయడం వల్ల మధ్య గాజాలో దాదాపు లక్షా 50వేల మంది వలస వెళ్లారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇప్పటివరకు యుద్ధంలో దాదాపు 21,500 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా, మరో 55,900 మంది గాయపడ్డారని వెల్లడించింది. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నట్లు తెలిపింది. 168 మంది తమ సైనికులు కూడా చనిపోయినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ఆయుధాల అమ్మకానికి అమెరికా ఆమోదం!
ఇజ్రాయెల్‌ను వ్యూహాత్మకంగా కాపాడటమే కాకుండా ఆయుధ అమ్మకాలకు అమెరికా ఆమోదం తెలిపింది. దాదాపు 148 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు విక్రయించేందుకు ఆమోదం తెలిపినట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తెలిపారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండానే అత్యవసరంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో పాలస్తీనా ప్రజలకు ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరినట్లు బ్లింకెన్ తెలిపారు. డిసెంబరు 9న కూడా 106 మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఇజ్రాయెల్‌కు విక్రయించేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది.
గాజాలో 70 శాతానికి పైగా ఇళ్లు ధ్వంసం
ఈ యుద్ధం వల్ల గాజా నగరంలోని సగం భవనాలు, 70 శాతానికి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. ఫొటోలు, రిమోట్ సెన్సింగ్ పద్ధతుల ద్వారా చేసిన విశ్లేషణలో ఈ వివరాలు వెల్లడయ్యాయని సమాచారం. భవనాల్లో జాబితాలో ఫ్యాక్టరీలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు మొదలైనవి ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రదేశాలను హమాస్ అనువుగా చేసుకుందని ఆరోపిస్తూ వాటిని ఇజ్రాయెల్ కూల్చివేసింది. దీని కారణంగా గాజా నగరంలోని మొత్తం 36 ఆస్పత్రుల్లో ఇప్పుడు 8 ఆస్పత్రులు మాత్రమే పేషెంట్లను అనుమతిస్తున్నాయని, అందులో నీళ్లు, విద్యుత్తు, కమ్యూనికేషన్ వంటి కనీస వసతులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాడులపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'డ్రస్డెన్ (జర్మన్ సిటీ) నగరంతో సహా బాంబు దాడికి గురైన ఇతర ప్రసిద్ధ నగరాల మాదిరిగా 'గాజా' అనే పదం చరిత్ర పుటల్లో నుంచి కనుమరుగు అవుతుంది' అని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతిజ్ఞ శాస్త్రవేత్త రాబర్ట్ పేప్ వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు! పోలీసులు హైఅలర్ట్- RBIని పేల్చేస్తామని బెదిరింపులు
122 క్షిపణులు, 36 డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా- ఉక్రెయిన్‌తో యుద్ధంలో అతిపెద్ద దాడి ఇదే!