Indian students studying in China: కరోనా కారణంగా విధించిన వీసా, విమాన ప్రయాణాలపై ఆంక్షలతో రెండేళ్లుగా స్వదేశంలో చిక్కుకున్న భారత విద్యార్థులకు తీపి కబురు అందించింది చైనా. చదువు కోసం తమ దేశానికి రావాలనుకునే భారతీయ విద్యార్థుల్లో కొందరిని అనుమతిస్తామని తెలిపింది. చైనా రావాలనుకునే భారతీయ విద్యార్థుల ఆందోళనలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ తెలిపారు.
" వారి రాకకు అవసరమైన నియమ నిబంధనలు, తమ దేశానికి వస్తున్న ఇతర దేశాల విద్యార్థుల అనుభవాల గురించి భారత ప్రభుత్వంతో చర్చించాం. భారతీయ విద్యార్థులను అనుమతించడంపై తమ వైపు వాస్తవానికి ఇప్పటికే పని ప్రారంభమైంది. నిజంగా చైనాలో చదువుకునే విద్యార్థుల జాబితాను భారత్ అందించడమే మిగిలి ఉంది. చైనాల పెద్ద సంఖ్యలో భారత విద్యార్థులు చదువుతున్నారని మాకు తెలుసు. వారి జాబితాను సిద్ధం చేసేందుకు కాస్త సమయం పట్టొచ్చు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కొంత మందిని మాత్రమే అనుమతించేందుకు చైనా సిద్ధంగా ఉంది. విదేశీ విద్యార్థులు వస్తున్నప్పుడు అక్కడి పరిస్థితులను సైతం పరిశీలించాలి. విదేశీ విద్యార్థులందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలవుతాయి."
- ఝావో లిజియాన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.
భారత విద్యార్థులను అనుమతించేందుకు ఎంత సమయం పడుతుందని అడిగిన ప్రశ్నకు.. భారత్‌లోని రాయబార కార్యాలయం, ఇతర ఛానళ్లు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తాయని చెప్పారు లిజియాన్. భారత్ నుంచి తిరిగి వచ్చే విద్యార్థులను ఎంపిక చేసేందుకు చైనా ఏవైనా ప్రమాణాలు పెట్టిందా అని అడగగా.. అలాంటి సమాచారం తనకు తెలియదని, ఎంబసీ, సహా అందుబాటులో ఉన్న ఛానళ్ల ద్వారా జాబితాను సిద్ధం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సమాచారం అందించండి: విద్యార్థులను అనుమతిస్తామని చైనా ప్రకటన చేసిన వెంటనే చర్యలు చేపట్టింది బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. చైనాకు తిరిగి రావాలనుకుంటున్న విద్యార్థులు సమాచారం అందించాలని సూచించింది.'భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో 2022, మార్చి 25న సమావేశమైన తర్వాత.. భారత విద్యార్థులను అనుమతించటంపై సానుకూలంగా స్పందించింది. చైనా రావాలనుకుంటున్న విద్యార్థుల జాబితాను భారత ఎంబసీ సిద్ధం చేసి చైనాకు అందించనుంది.' అని పేర్కొంది. విద్యార్థులు గూగుల్ ఫారమ్‌లోని లింకు (https://forms.gle/MJmgByc7BrJj9MPv7) ద్వారా మే 8వ తేదీలోపు వివరాలు సమర్పించాలని కోరింది. ఈ వివరాలు చైనాకు అందించగానే విద్యార్థుల వివరాలను తనిఖీ చేసి వారికి అనుమతి ఇవ్వనున్నారని పేర్కొంది. ఈ ప్రక్రియకు కాస్త సమయం పడుతుందని తెలిపింది.
2019, డిసెంబర్‌లో చైనాలో కరోనా ప్రారంభం కాగానే అక్కడ విద్య అభ్యసిస్తున్న సుమారు 23వేల మంది భారతీయ విద్యార్థులు స్వదేశం తిరిగి వచ్చారు. అందులో అధికంగా వైద్య విద్యనభ్యసిస్తున్నవారే. చైనా అమలు చేస్తున్న వీసా, విమాన ప్రయాణ నిబంధనలతో వారు రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. విద్యార్థులే కాదు చైనాలో వివిధ పనులు చేసుకుంటున్న వందల కుటుంబాలు సైతం స్వదేశంలో చిక్కుకుని తిరిగి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాయి.
ఇదీ చూడండి: డ్రాగన్‌కు భారత్ ఝలక్.. టూరిస్ట్ వీసాలు సస్పెండ్