ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన మరో తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరమైంది. ఉక్రెయిన్ జీవాయుధాలు తయారు చేస్తోందని ఆరోపిస్తున్న రష్యా దానిపై దర్యాప్తు చేపట్టాలంటూ తీర్మానం తీసుకొచ్చింది. దీనిపై ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్ నిర్వహించగా భారత్ అందులో పాల్గొనలేదు.
ఉక్రెయిన్ జీవాయుధాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికాతో కలిసి లాబోరేటరీల్లో మిలిటరీ బయోలాజికల్ కార్యకలాపాలు సాగిస్తోందని రష్యా కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఓ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ తీర్మానం ప్రవేశపెట్టింది. రష్యా, చైనా మాత్రమే దీనికి అనుకూలంగా ఓటెయ్యగా.. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వ్యతిరేకించాయి. భారత్ సహా భద్రతా మండలిలోని మిగిలిన సభ్య దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది.
జీవాయుధాలపై రష్యా చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా ఈ సందర్భంగా పేర్కొంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. గతంలోనూ ఐరాస వేదికగా ఉక్రెయిన్‌పై తీసుకొచ్చిన పలు తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అయితే రష్యా తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌లో భారత్ పాల్గొనకపోవడం ఇదే తొలిసారి.
ఇదీ చదవండి:'ఆమె కాళ్లు విరగ్గొట్టాలనుకున్నా'.. అమెరికా స్పీకర్ కిడ్నాప్‌నకు యత్నం!