Imran Khan Jaishankar news : భారత్‌పై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. భారత విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్నారు. లాహోర్‌లో బహిరంగ సభలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను ఇమ్రాన్ ప్లే చేశారు. అమెరికా ఒత్తిడి ఉన్నా రష్యా నుంచి తక్కువ ధరకు భారత్ చమురు కొనుగోలు చేసిందని కొనిడాయారు.
భారత్, పాకిస్థాన్ ఒకేసారి స్వాతంత్ర్యం పొందాయని, విదేశాంగ విధానం విషయంలో ప్రజానుకూల నిర్ణయాలను భారత్ తీసుకుంటోందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ఐరోపా దేశాలు రష్యా నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నాయని, తమ ప్రజలకు కోసం తామూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని జైశంకర్ వ్యాఖ్యానించిన క్లిప్‌ను ఇమ్రాన్ ప్లే చేశారు.
ప్రస్తుత పాకిస్థాన్ ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో అమెరికా ఒత్తిడికి లొంగిపోతోందని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలుకు సంప్రదింపులు జరిపామని కానీ ప్రస్తుత పాక్ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఆ పని చేయడం లేదని ఆరోపించారు. పాకిస్థాన్‌లో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రజలు పేదరికంలోకి కూరుకుపోతున్నారని ఇమ్రాన్ అన్నారు. ఈ బానిసత్వానికి తాను వ్యతిరేకమని తెలిపారు. గతంలో కూడా పలుమార్లు ఇమ్రాన్‌ఖాన్ భారత విదేశాంగ విధానాన్ని కొనియాడారు.
ఇవీ చదవండి: కోలుకుంటున్న సల్మాన్ రష్దీ వెంటిలేటర్ తొలగింపు