ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు జరిపిన రెండు కాల్పుల్లో సూమారు 50 మంది మృతిచెందారు. ఉత్తర-మధ్య నైజీరియా బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామంలో మార్కెట్ ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం సాయుధులు విచక్షణ రహితంగా కాల్పులు జరపగా.. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మురుసటి రోజు బుధవారం అదే ప్రాంతంలో మరోసారి రెచ్చిపోయారు దుండగులు. ఈ ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. అయితే, ఈ దాడుల వెనుక ఉన్న ఉద్దేశం తెలియలేదు. కానీ ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ ఈ దాడులకు బాధ్యత వహించలేదని తెలిపారు. అయితే, ఈ ప్రాంతంలో రైతులు, స్థానిక పశువుల కాపరుల మధ్య గొడవలు జరుగుతున్నాయని వెల్లడించారు. స్థానిక పశువుల కాపరులే ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బెన్యూ రాష్ట్రాన్ని'నైజీరియా ఫుడ్ బాస్కెట్ 'గా వ్యవహరిస్తారు ఇక్కడి ప్రజలు. ఎందుకంటే ఇక్కడ సమృద్ధిగా పంటలు పండతాయి. అయితే, కాపరులు తమ పొలాల్లో పశువులు మేపుతూ.. పంటలు నాశనం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 1965లో వచ్చిన చట్టం ద్వారా ఆ భూములన్నీ తమకే చెందుతాయని పశువుల కాపలదారులు వాదిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తరచూ జరిగే ఈ ఘర్షణల వల్ల రాష్ట్రం నుంచి వ్యవసాయ దిగుబడులు తగ్గిపోయాయి. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ఈ పరిస్థితి మరింత కుంగదీస్తోంది.
చర్చిలో కాల్పులు.. 50 మంది దుర్మరణం..
నైజీరియాలోని నైరుతి ప్రాంతం ఓండోలోని ఓ చర్చిపై ఓ దుండగుడు దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులపై కాల్పులకు తెగబడ్డాడు. బాంబులు విసరటం వల్ల పలువురు చిన్నారులు సహా 50 మంది వరకు మరణించారు. ఇంతకీ నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
పెను విషాదం.. పడవ మునిగి 76 మంది మృతి
నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. 85 మందితో వెళ్తున్న పడవ ఒగ్బారూ ప్రాంతంలో వరదల కారణంగా ఒక్కసారిగా మునిగిపోవడమే ఇందుకు కారణం. పడవ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇతర విభాగాల సిబ్బందిని రంగంలోకి దింపారు. గల్లంతైన వారి కోసం గాలించారు. 76 మృతదేహాలు వెలికితీశారు. ఈ దుర్ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ స్పందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.