America Graduation Party Firing: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సెంట్రల్ వర్జీనియాలో గ్రాడ్యుయేషన్ పార్టీ జరుగుతున్న సమయంలో ఓ 20 ఏళ్ల యువకుడు తుపాకీతో చెలరేగాడు. శనివారం జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఏడుగురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే గాయపడిన ఐదుగురు బాధితులు ఆసుపత్రికి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తిని పీటర్స్బర్గ్కు చెందిన జె.కార్టర్‌గా గుర్తించామని చెప్పారు. కాల్పుల నుంచి తప్పించుకున్న మరో ఇద్దరికి రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మరో చోట తుపాకీ మోత.. అమెరికాలో శనివారం మరో చోట తుపాకీ మోత మోగింది. వెస్ట్ టెక్సాస్‌లో జరిగిన హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పార్టీలో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరిగింది. అదే అదనుగా తీసుకున్న ఓ దుండగుడు.. తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
గుంపుపైకి కాల్పులు.. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కూడా శనివారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. ఓ ప్రాంతంలో గుంపుగా ఉన్న ప్రజలపైకి ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 11 మంది గాయపడ్డారు. అయితే నిందితుడ్ని ఇంకా అరెస్టు చేయలేదని, కానీ అతడు వాడిన తుపాకీ మాత్రం లభ్యమైందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: వంద రోజుల భరోసా.. ప్రసంగాలతో స్ఫూర్తి నింపుతున్న జెలెన్స్కీ
ఆసుపత్రిలోకి చొరబడి వైద్యసిబ్బందిపై కత్తితో దాడి.. పార్టీలో కాల్పుల మోత