Gotabaya rajapaksa singapore: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్వదేశానికి తిరిగిరానున్నారు. ఆయన దాక్కోలేదని.. సింగపూర్ నుంచి శ్రీలంకకు వచ్చే అవకాశం ఉందని కేబినేట్ ప్రతినిధి గుణవర్ధనే తెలిపారు. ఆయన వచ్చాక ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మొదట జులై 13న కొలంబో నుంచి మాల్దీవులకు పారిపోయిన గొటబాయ.. అక్కడి నుంచి సింగపూర్‌కు చేరుకున్నారు. అయితే.. ఆయన తన వ్యక్తిగత పర్యటన కోసం అనుమతి తీసుకున్నారని, ఆశ్రయం కోరలేదని సింగపూర్ స్పష్టం చేసింది. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం ఆయనకు 14 రోజుల విసిట్ పాస్‌ను మంజూరు చేసింది.
మరోవైపు, నూతనంగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘెకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంకకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎల్లప్పడు సహకారం అందిస్తామని చెప్పారు. ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం పరస్పరం సహకరించుకుందామన్నారు. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసి విదేశాలకు పారిపోవడం వల్ల.. విక్రమసింఘె ఆయన స్థానంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు మంగళవారం మూడో విడత నిత్యావసరాలను అందించింది భారత్. తమిళనాడు ప్రభుత్వం అందించిన బియ్యం, పాల పౌడర్, మందులను భారత హైకమిషన్ అక్కడి ప్రభుత్వానికి అందజేసింది. జనవరి నుంచి ఇప్పటివరకు శ్రీలంకకు సుమారు 4బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది.
2.2 కోట్ల జనాభా గల శ్రీలంక.. తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గత 7 దశాబ్దాల్లోనే ఎన్నడూ లేని విధంగా నిత్యావసరాలు, అత్యవసరాల కొరత ఏర్పడింది. అయితే ఈ పరిస్థితికి రాజపక్స కుటుంబమే కారణమని, వారు వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.
ఇవీ చదవండి: చెస్ ఆడుతుండగా రోబో 'పైశాచికం'.. పిల్లాడి వేలు విరిచేసిన చిట్టి!