Ecuador Prison Riot: ఈక్వెడార్ జైలులో జరిగిన ఘర్షణలో 20 మంది ఖైదీలు మరణించారు. ఖైదీలు ఒకరిపై మరొకరు మారణాయుధాలతో దాడి చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్యాట్రికో కార్రిల్లో తెలిపారు. ఈ ఘర్షణలకు రాజకీయ సంబంధాలున్నట్లు ఆయన అనుమానిస్తున్నారు. ప్రస్తుతం జైలులో ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు తెలిపారు.

హింసాత్మక ఘటన నేపథ్యంలో జైలు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలులోని ప్రతి బ్లాకును తనిఖీ చేస్తున్నట్లు పోలీస్ కమాండర్ జనరల్ కార్లోస్ కబ్రీరా స్పష్టం చేశారు. వెయ్యి మంది పోలీసులు, మిలిటరీ సిబ్బంది ఘర్షణలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారని వెల్లడించారు. ఖైదీలు ఒకరిపై ఒకరు కాల్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. జైలు నుంచి భారీ శబ్దాలు, అరుపులు వినిపించాయని స్థానిక మీడియా పేర్కొంది. ఈక్వెడార్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. 2020లో జరిగిన ఘర్షణల్లో 316 మంది ఖైదీలు మరణించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.

ఇదీ చదవండి: 'పుతిన్ యుద్ధ నేరాలపై విచారణ.. రష్యాపై మరిన్ని ఆంక్షలు'