Dubai building fire accident : దుబాయ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయులు సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. అల్ రస్ ప్రాంతంలో శనివారం జరిగిందీ దుర్ఘటన. మృతుల్లో కేరళకు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరు భార్యాభర్తలు. తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు పురుషులు కూడా అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరు ఆ భవనంలో పని చేస్తున్నట్లు తెలిసింది.
ఓ భవనం నాల్గవ అంతస్తులో.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు మంటలు చెలరేగినట్టు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనంలో ఉన్నవారందరినీ ఖాళీ చేయించారు. సహాయక సిబ్బంది ఎంతో శ్రమించి.. మధ్యాహ్నం 2.42 గంటలకు మంటల్ని ఆర్పగలిగారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి దారి తీసిందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి కారణాలు తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
మృతుల కుటుంబాలకు అండగా..
నసీర్ వాటనపల్లి అనే భారతీయ సామాజిక కార్యకర్త.. అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారు కుటుంబ సభ్యులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. దుబాయ్ పోలీసులు, భారత రాయబారి కార్యాలయం, స్నేహితులతో సమన్వయం చేసుకుంటూ.. ఆ వివరాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు.
మెక్సికోలో ఏడుగురు హత్య
మెక్సికోలోని ఓ రిసార్టులో సాయుధ దుండగులు పెను బీభత్సం సృష్టించి ఏడుగురిని బలిగొన్నారు. మృతుల్లో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరంతా సెలవుల్ని ఆహ్లాదంగా గడపడానికి రిసార్టుకు వచ్చిన వారే.
పోలీసుల సమాచారం ప్రకారం.. సెంట్రల్ మెక్సికోలోని హువానాజువాటో రాష్ట్రం కోర్టాజార్లోని ఓ రిసార్టుకు పదుల సంఖ్యలో ప్రజలు వచ్చారు. వీరంతా సరదాగా గడుపుతూ ఉండగా అనేక మంది దుండగులు తుపాకులతో వచ్చారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు భయంతో పరుగులు తీశారు. దుండగులు.. రిసార్టులోని ఓ స్పా షాప్‌ను ధ్వంసం చేశారు. అక్కడి సెక్యూరిటీ కెమెరాలు లాక్కుని పారిపోయారు.
దాడి సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెక్సికో సైనికులు, పోలీసులు కలిసి హెలికాప్టర్లతో దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దాడికి కారణమేంటో ఇంకా తెలియలేదని అధికారులు చెప్పారు.
వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతమైన హువానాజువాటో.. అనేక ఏళ్లుగా మెక్సికోలో అత్యంత హింసాయుత రాష్ట్రంగా పేరుగాంచింది. అక్కడి జలిస్కో న్యూ జనరేషన్ డ్రగ్ మాఫియాకు, స్థానిక నేరస్థుల ముఠాలకు తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి.