Columbia Plane Crash 2023 Update : కొలంబియాలో మే 1న జరిగిన విమాన ప్రమాదంలో గల్లంతైన నలుగురు చిన్నారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం భద్రతాదళాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో నిత్యం క్రూరమృగాలు సంచరించే అడవుల్లో బాధిత చిన్నారుల ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 100 మందితో కూడిన ప్రత్యేక దళాలు 'ఆపరేషన్ హోప్' పేరిట సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో మిలిటరీ అధికారులకు స్థానిక తెగలకు చెందిన దాదాపు 70 మంది తమ సహకారం అందిస్తున్నారు. ఈ నెల రోజుల సమయంలో ఒక్కో సైనికుడు 15 వందల కిలోమీటర్లు నడిచారు. కొద్ది రోజుల క్రితం చిన్నారుల కోసం గాలిస్తున్న సమయంలో అటవీ ప్రాతంలో ఓ బాటిల్ దొరికింది. అది కచ్చితంగా చిన్నారులకు సంబంధించినదే అని అధికారులు భావిస్తున్నారు.
15 రోజుల క్రితం చిన్నారులు క్షేమంగానే ఉన్నారనే విధంగా చిన్నగుడారం, జుట్టు రిబ్బన్, పాలసీసా, సగం తిన్న పండ్లు కనిపించాయి. ఈ క్రమంలోనే విమానం కూలిన ప్రదేశానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో చిన్నారుల పాదముద్రలు కనిపించాయి. ఎంతో కఠినతరమైన గాలింపు చర్యల అనంతరం ఈ విషయం గుర్తించినట్లు ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటించారు. దీంతో వారు సురక్షితంగా ఉన్నారని కొలంబియాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే వారి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు.
Columbia Plane Crash 2023 : దట్టమైన అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలోని ఆరారాక్యూరా (Araracuara) నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియారే (San Jose del Guaviare) ప్రాంతానికి మే 1న తెల్లవారుజామున ఓ చిన్నపాటి విమానం బయలు దేరింది. ఆ సమయంలో విమానం దట్టమైన అటవీ ప్రాంతంపైన ఎగురుతోంది. విమానంలో నలుగురు చిన్నారుల, ఓ పైలట్‌తో సహా మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది నేల కూలబోతున్నట్లు పైలట్ ప్రకటించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాడార్ల పరిధి నుంచి ఆ విమానం వేరయింది. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు విమాన శకలాలను గుర్తించారు. అక్కడ పైలట్, చిన్నారుల తల్లితోపాటు గైడ్ మృతదేహాలను రెస్య్యూ సిబ్బంది గుర్తించారు. అయితే మిగతా నలుగురు చిన్నారులు మాత్రం కనిపించలేదు. ఆ చిన్నారుల్లో 11 నెలల పసిబిడ్డతో సహా 13, 9, 4 ఏళ్ల వయసు వారు ఉన్నారని అధికారులు తెలిపారు.