చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్‌లో అనేక సంవత్సరాలుగా పాక్షికంగా నిఘా బెలూన్ వ్యవస్థ పనిచేస్తోందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ సహా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక దేశాల సైనిక ఆస్తుల సమాచారాన్ని ఈ వ్యవస్థ సేకరించిందని పేర్కొంది. ఈ నివేదిక అనేక మార్గాలు, నిఘా అధికారుల ద్వారా సేకరించినట్లు వెల్లడించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వైమానిక దళం ద్వారా నిర్వహిస్తున్న ఈ నిఘా ఎయిర్‌షిప్‌లు ఐదు ఖండాలలో కనిపించాయని అధికారులు తెలిపారు.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సముదాయానికి చెందిన నిఘా బెలూన్లు.. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయని ఉన్నతాధికారులు తెలిపారు. గత వారం కనిపించిన బెలూన్ కాకుండా.. కొన్నేళ్లుగా కనీసం నాలుగు బెలూన్లు హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గ్వామ్లో ప్రత్యక్షమయ్యాయని ది డైలీ తెలిపింది. ట్రంప్ హయాంలో మూడు నాలుగు సందర్భాల్లో ఇలాంటివే జరిగినా.. ఇటీవలే వాటిని చైనా నిఘా ఎయిర్‌షిప్‌లుగా గుర్తించినట్లు ప్రకటించింది. కాగా, ఇటీవల తమ గగనతలంలో తిరిగిన చైనా నిఘా బెలూన్‌ను అమెరికా ఇటీవలే కూల్చివేసింది. వాటి శిథిలాలను సేకరించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను అమెరికా నేవీ విడుదల చేసింది.