China Taiwan War : తైవాన్‌ను భయపెట్టే ప్రయత్నాలను చైనా ముమ్మరం చేసింది. భారీ సంఖ్యలో యుద్ధ నౌకలు, విమానాలను.. గత రెండు రోజులుగా తైవాన్ దిశగా తరలిస్తోంది. మొదట చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 38 యుద్ధ విమానాలు, 9 యుద్ధ నౌకలను తైవాన్ చుట్టూ మోహరించగా.. తర్వాత మరో 30 విమానాలు ఆ దేశం దిశగా కదిలాయి. వాటిలో జే-10, జే-16 ఫైటర్ జెట్లు ఉన్నాయి. 32 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధిలోని ఇరు దేశాల అనధికారిక సరిహద్దు అయిన మిడ్‌లైన్‌ను దాటాయి. తైవాన్ నిర్వహించనున్న వార్షిక సైనిక విన్యాసాల నేపథ్యంలో.. చైనా ఈ చర్యలకు పాల్పడింది.
అమెరికా హౌస్ స్పీకర్‌తో సమావేశమే కారణమా..
తైవాన్ స్వాతంత్ర్యం, వేర్పాటువాద శక్తులు, బాహ్య శక్తుల మధ్య కుట్రని వారికి ఇది తీవ్రమైన హెచ్చరికని చైనా ఆర్మీ అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు చేసింది. తైవాన్ స్వాతంత్ర్యమనే మాటకు.. ఈ అంశంలో విదేశీ శక్తుల జోక్యానికి చోటు ఇవ్వలేమని ఇదివరకే స్పష్టం చేసింది. కాగా అలాంటి పరిస్థితుల్లో తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్.. చైనా హెచ్చరికలను బేఖాతరు చేసి.. ఏప్రిల్‌లో అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆమె అమెరికా హౌస్ స్పీకర్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆగ్రహించిన చైనా, అప్పట్లో కూడా యుద్ధ నౌకలతో పాటు ఫైటర్ జెట్లను మోహరించి.. తైవాన్ సరిహద్దులో ఆర్మీ డ్రిల్స్ చేసింది. యుద్ధ విన్యాసాలు ముగించుకొని.. తాము యుద్ధానికి సిద్ధం అంటూ తైవాన్‌ను హెచ్చరించింది. వెన్ అమెరికా పర్యటనతో సంబంధం ఉన్న వ్యక్తులపై ప్రయాణ నిషేధంతో పాటు ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది.
గతంలోనూ అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి.. తైవాన్‌లో పర్యటించిన తర్వాత చైనా.. తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు చేపట్టి హెచ్చరికలు పంపింది. ఏప్రిల్‌లో మరోసారి అమెరికా హౌస్ స్పీకర్ మెక్ కార్తీ, తైవాన్ అధ్యక్షురాలి పర్యటన.. చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. కాగా స్వతంత్ర పాలనలో ఉన్న తైవాన్‌పై అధికారం తమదేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. అందులో భాగంగానే తైవాన్ జలసంధి, గగనతలంలోకి.. చైనా పలుమార్లు యుద్ధ నౌకలను, డ్రోన్లను సరిహద్దులకు పంపుతోంది.
సార్వభౌమత్వాన్ని రక్షించడానికి సిద్ధం : తైవాన్
తమ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి సిద్ధంగా ఉన్నామన్న తైవాన్ రక్షణశాఖ.. క్షిపణి రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసినట్లు గతంలోనే వెల్లడించింది. తమ దేశ భద్రత స్థిరత్వానికి విఘాతం కలిగించేందుకు, పాల్పడుతున్న చైనా చర్యలను తైవాన్ మొదటి నుంచే ఖండిస్తూ వస్తోంది.