China flights reopen: కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనుంది చైనా. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల క్వారంటైన్ గడువును సవరించింది. అంతకుముందు వారం రోజులు ఉండగా.. ప్రస్తుతం నిర్దేశిత హోటళ్లలో 3 రోజులు, ఇళ్లలో 2 రోజులు క్వారంటైన్లో ఉండాలని సూచించింది. అమెరికా సహా 125కు పైగా దేశాలతో విమాన సర్వీసులను క్రమబద్ధీకరణకు చైనా అంగీకారం తెలిపింది. దీంతో 2,025 విమానాల రాకపోకలు ఈ వారంలో ప్రారంభమవుతాయని పేర్కొంది.
భారత్కు విమాన సర్వీసుల పునరుద్ధరణపై చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. 2020 నవంబర్ నుంచి చైనా, భారత్ మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబాల వీసాలపై నిషేధం విధించడం వల్ల రెండేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. గత నెలలో వీసాలపై నిషేధం ఎత్తివేసినా.. విమాన సర్వీసులు పునరుద్ధరించపోవడం వల్ల వారంతా తిరిగి చైనాకు వెళ్లడం సమస్యగా మారింది. 23,000 మందికిపైగా భారతీయ విద్యార్థులు చైనాలో చదువుకుంటున్నారు. కొవిడ్ వీసా నిబంధనలతో ఇక్కడే నిలిచిపోయారు. ఇప్పుడు నిబంధనలు లేకపోవడం వల్ల కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. వీరందరి పేర్లు ఇవ్వాలని చైనా కోరగా భారత్ సమర్పించింది.
మరోవైపు శ్రీలంక, పాకిస్థాన్, రష్యా లాంటి దేశాల విమానాలకు అనుమతి ఇచ్చింది చైనా. దీంతో ఆయా దేశాల విద్యార్థులు ప్రత్యేక విమానాల్లో చైనాకు చేరుకుంటున్నారు. విమానాలు పునరుద్ధిరించకపోవడం వల్ల చైనాకు వెళ్లడం కష్టంగా మారిందని భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల మీదగా ప్రయాణించడం వల్ల ఖర్చులు అధికమవుతాయని వాపోయారు. విమానాల అనుమతిపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం