China Gas Explosion : చైనా.. ఇంచువాన్ నగరంలోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 31 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
బుధవారం రాత్రి 8.40 గంటల సమయంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. అయితే గురువారం ఉదయం చైనా ప్రభుత్వ అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్పందించింది. రెస్టారెంట్‌లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని చెప్పింది. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించింది.
గత నెల 1వ తేదీన.. చైనీస్ పెట్రోకెమికల్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో తొమ్మిది మంది మరణించారు. అదే రోజు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరో ముగ్గురు చనిపోయారు. ఫిబ్రవరిలో మంగోలియాలోని ఉత్తర ప్రాంతంలో బొగ్గు గని కూలిపోవడం వల్ల 53 మంది మరణించారు. గతేడాది నవంబర్‌లో సెంట్రల్ చైనాలోని ఒక పారిశ్రామిక సంస్థలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఆస్పత్రిలో భవనంలో మంటలు..
రెండు నెలల క్రితం.. చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని చాంగ్‌ఫెంగ్ ఆస్పత్రి భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది.. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో ఉన్న 71 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి
కొన్నాళ్ల క్రితం.. చైనా జెజియాంగ్ ప్రావిన్సులోని జిన్హువా నగరం వుయి కౌంటీలోని ఓ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం 4 గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
చెక్క తలుపులు, పెయింట్ లాంటివి తయారు చేసే ప్లాంట్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాధానికి బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నామని.. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
అగ్ని ప్రమాదంలో 31 మంది మృతి..
కొన్నాళ్ల క్రితం చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. జిలిన్ రాష్ట్ర రాజధాని చాంగ్‌చున్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. న్యూ ఏరియా ఇండస్ట్రియల్ జోన్‌లోని హైటెక్ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. జిలిన్ రాష్ట్ర రాజధాని అయిన చాంగ్‌చున్.. వాహనాల తయారీ కేంద్రంగా ప్రసిద్ధి. ఈ పూర్తి వార్త ఇక్కడ క్లిక్ చెయ్యండి.