Boat Accident Greece : గ్రీస్‌లో వలసదారులతో వెళ్తున్న ఓ పడవ సముద్రంలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 78 మంది మరణించగా.. అనేక మంది గల్లంతయ్యారు. మంగళవారం రాత్రి జరిగిందీ ఘటన. తూర్పు లిబియా నుంచి వలసదారులతో ఇటలీ వెళుతున్న పడవ.. ప్రమాదవశాత్తు బోల్తా పడినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ గ్రీస్ సముద్ర తీరానికి 75 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 104 మందిని రక్షించినట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ నలుగురు హైపోతెర్మియా లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. సముద్రంలో ఎంత మంది గల్లంతయ్యారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ఆరు కోస్ట్‌గార్డు నౌకలు, నేవీ యుద్ధ నౌక, మిలటరీ విమానం, ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్, అనేక ప్రైవేటు నౌకలు, యురోపియన్ సరిహద్దు రక్షణ దళం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
గ్రీస్‌ను దాటుకుని ఇటలీ చేరుకునేందుకు స్మగ్లర్లు ఎక్కువగా ఈ మార్గంలో వెళ్తుంటారు. ముఖ్యంగా స్థానిక కోస్ట్‌గార్డ్‌ల బారిన పడకుండా ఉండేందుకు భారీ పడవల ద్వారా వీరిని తరలిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటలీకి చెందిన పడవ తూర్పు లిబియాలోని తోబ్రక్ నుంచి వలసదారులతో ఇది బయలుదేరినట్లు అనుమానిస్తున్నారు. తొలుత దీనిపై ఇటలీ కోస్ట్‌గార్డ్ ముందుగానే గ్రీస్ అధికారులతోపాటు ఈయూ సరిహద్దు రక్షణ ఏజెన్సీ-ఫ్రాంటెక్స్‌లను అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో భారీ గాలులు వీడయం వల్ల పడవ బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.
వలసదారులకు నో ఎంట్రీ..
అక్రమ వలసలను కట్టడి చేసేందుకు లిబియా అధికారులు ఇటీవల ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఈజిప్టు, సిరియా, సూడాన్, పాకిస్థాన్ దేశాలకు చెందిన వేల మందిని అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. వారిలో ఈజిప్టునకు చెందిన వారిని రోడ్డు మార్గంలో సొంత దేశానికి పంపించేశారు. మరోవైపు పశ్చిమ లిబియాలో అక్రమ వలస స్థావరాలపైనా అక్కడి అధికారులు దాడులు చేశారు. సుమారు 1800 మందిని అదుపులోకి తీసుకొని నిర్బంధ కేంద్రాలకు తరలించినట్లు ఐరాస శరణార్థి విభాగం వెల్లడించింది.
నైజీరియా బోటు ప్రమాదం.. నైజీరియాలో ఇటీవల ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఓ పడవ క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిపై బోల్తా పడిన ఘటనలో 100 మంది మరణించగా.. అనేక మంది గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నీటిలో మునిగిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులు పెళ్లికి వెళ్లి వస్తుండగా జరిగిందీ దుర్ఘటన. పడవలో మహిళలతో పాటు పిల్లలు కూడా ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.