భారత్- ఈజిప్ట్‌ల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా తీసుకెళ్లాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలను విస్తరించడం సహా ఉగ్రవాదం నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించాయి. వచ్చే ఐదేళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1200 కోట్ల డాలర్లకు పెంచుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసీ.. ప్రధాని మోదీతో జరిపిన ఈ సమావేశంలో ఈ మేరకు అవగాహనకు వచ్చారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయం, వాణిజ్యం సహా అనేక రంగాలపై సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈజిప్ట్ అధ్యక్షుడితో మోదీ విస్తృత చర్చలు జరిపారు. ఈ మేరకు ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
"సముద్రానికి ఇరువైపులా భారత్, ఈజిప్ట్ ఉన్నాయి. ఇరుదేశాల మధ్య సమన్వయం వల్ల ఈ ప్రాంతంలో శాంతికి, సమృద్ధికి దోహదం చేస్తుంది. అందువల్ల ఇవాళ్టి చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల రాజకీయ, రక్షణ, ఆర్థిక, వైజ్ఞానిక రంగాల్లో మరింత సహకారం, దీర్ఘకాల సంబంధాలకు మార్గం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడులపై భారత్-ఈజిప్ట్ విచారం వ్యక్తం చేశాయి. మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు అని, సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు గట్టి చర్యలు అవసరమని ఇరుదేశాలు అంగీకరించాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
సాంస్కృతిక సంబంధాలతో పాటు రక్షణ, విదేశాంగ విధానం, యూత్ ఎక్స్ఛేంజ్ తదితర అంశాలపై కూడా ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. భారత్, ఈజిప్ట్ దేశాల మధ్య దౌత్య సంబంధాలను స్మరించుకుంటూ పోస్టల్ స్టాంపులను మార్పిడి చేసుకున్నారు. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, ప్రసార రంగాలలో సహకారాన్ని అందించే ఐదు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
అయితే బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్కు విచ్చేసిన ఎల్సిసీకి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రపతి భవన్ వద్ద ఘన స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం ఈజిప్ట్ అధ్యక్షుడు దిల్లీ చేరుకున్నారు. గురువారం జరిగే గణతంత్ర వేడుకలకు ఆయన హాజరు కానున్నారు. సిసీ భారత్ పర్యటనకు రావటం ఇదే మొదటిసారి.
"గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా మీ భారత్ పర్యటన మా భారతీయులందరికీ ఎనలేని సంతోషాన్ని కలిగించే విషయం. మీతో చర్చలకోసం ఎదురుచూస్తున్నాం" అని అబ్దెల్ ఫతా ఎల్ సిసీకు స్వాగతం తెలుపుతూ ప్రధాని మోదీ మంగళవారం ట్వీట్ చేశారు.