Australian Sailor And Dog Rescued : ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన టిమ్ షాడోక్ అనే 54 ఏళ్ల నావికుడు నెలల తరబడి పసిఫిక్ మహా సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ మధ్యలో చిక్కుకుపోవడం వల్ల సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండె ధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో ఆయనకు తోడుగా పెంపుడు కుక్క మాత్రమే ఉంది. పసిఫిక్ సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి అటుగా రావడం వల్ల వారు అతడ్ని గుర్తించి రక్షించారు.
Tim Shaddock Missing : తన శునకం బెలతో కలిసి మెక్సికోలోని లా పాజ్ నుంచి ఫ్రాన్స్‌లోని పాలినేషియాకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బోట్‌లో షాడోక్ బయలుదేరాడు. సుమారు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. కొన్ని వారాల తర్వాత మార్గమధ్యలో ప్రమాదవశాత్తు తుపాన్ రావడం వల్ల అతడి ఓడ దెబ్బతింది. లోపల ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు చెడిపోయాయి. దీంతో షాడోక్ ఎవరినీ సంప్రదించే వీలు లేకుండా పోయింది.
Tim Shaddock Boat : సముద్రంలో పచ్చి చేపలను తింటూ, వర్షం పడినప్పుడు ఆ నీటిని భద్రపరుచుకుని తాగుతూ కాలం గడిపాడు షాడోక్. రాత్రివేళ ఓడలోని టెంట్‌లో తలదాచుకునేవాడు. ఇలా రెండు నెలలపాటు సముద్రంలో ఎదురైన కష్టాలను తట్టుకుంటూ జీవించాడు. చివరగా అటుగా వచ్చిన ఓ మెక్సికన్ ట్యూనా పడవలో ఉన్న సిబ్బంది వీరిని గుర్తించి కాపాడారు. షాడోక్‌ను రక్షించిన ఫోటోలను మెక్సికన్ ట్యూనా పడవ యజమాని విడుదల చేశారు. సముద్రపు ఒడ్డుకు 1,900 కిలోమీటర్ల దూరంలో వీరిని గుర్తించినట్లు తెలిపారు. రక్షించిన సమయంలో షాడోక్, అతని శునకం విషమ స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఆ పడవలో ఉన్న వారు ఆహారం, నీరు షాడోక్‌కు అందించి ప్రథమ చికిత్స చేశారు.
షాడోక్ , అతడి శునకం ఆరోగ్యం నిలకడగా ఉందని వారిని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. పసిఫిక్ సముద్రంలో చిక్కుకుపోయి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని చేపలను పట్టడం రావడం ఆ సమయంలో తనకు ఎంతో ఉపయోగపడిందని షాడోక్ తెలిపాడు. లేదంటే పరిస్థితి మరింత కష్టమయ్యేదన్నాడు. చాలా రోజుల నుంచి సరైన ఆహారం, నిద్ర కరవయ్యాయని ప్రస్తుతం ఈ రెండు తనకు చాలా అవసరమని షాడోక్ తెలిపాడు.