Armed Men Storm Live TV : ఈక్వెడార్‌లోని గ్వయకిల్‌లో సాయుధులైన దుండగులు టీసీ అనే టీవీ ఛానెల్ లైవ్ స్టూడియోలోకి ప్రవేశించి తీవ్ర కలకలం సృష్టించారు. మాస్క్‌లు ధరించి తుపాకులు, డైనమైట్‌లతో వచ్చి, వార్తలు చదువుతున్న యాంకర్, జర్నలిస్టులు ఇతర ఉద్యోగులను బెదిరించారు. వారిని నేలపై కూర్చోబెట్టి తలపై తుపాకీ గురి పెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని బెదిరించారు. ఇదంతా టీవీ ఛానెల్‌లో 15 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైంది. లైవ్‌లో తుపాకీ శబ్దాలు వినిపించాయి. తర్వాత స్టూడియోను చుట్టుముట్టిన పోలీసులు 13 మందిని అరెస్టు చేసి ఉగ్రవాద చర్యల కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి వెనుక ఉన్నది ఎవరనే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
![Armed Men Storm Live TV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/20473556_armed_men_storm_live_tv--10.jpg)
![Armed Men Storm Live TV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/20473556_armed_men_storm_live_tv--4.jpg)
"దుండగులు కార్యాలయంలోకి వచ్చినప్పుడు నేను కంట్రోల్ రూమ్‌లో ఉన్నాను. వారిలో ఒకరు నా దగ్గరకొచ్చి తలపై తుపాకీ గురిపెట్టాడు. నేలపై కూర్చోవాలని బెదిరించాడు. నేనింకా షాక్‌లోనే ఉన్నాను. ఈ దేశాన్ని విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనిపిస్తోంది. స్టూడియోలో జరుగుతున్న ఘోరమంతా దాదాపు 15 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైంది. పోలీసులు చుట్టుముట్టారని గుర్తించిన దుండగులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు."
--మాన్రిక్, టీసీ టీవీ ఛానెల్ అధిపతి
![Armed Men Storm Live TV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/20473556_armed_men_storm_live_tv--5.jpg)
![Armed Men Storm Live TV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/20473556_armed_men_storm_live_tv--6.jpg)
కనిపిస్తే కాల్చేయమని సైనికులకు ఆదేశం
ఇటీవల జైళ్ల నుంచి కొందరు డ్రగ్ గ్యాంగ్‌స్టర్లు తప్పించుకున్న తర్వాత దేశంలో ఈ తరహా హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కిడ్నాప్ అయ్యారని చెప్పారు. ఈ ఘటన తర్వాత దేశాధ్యక్షుడు నోబోవా మాదకద్రవ్యాలను సరఫరా చేసే 20 ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు. ఈ ముఠా సభ్యులు ఎక్కడ కనిపించినా హతమార్చేందుకు సైనికులకు అధికారం ఇచ్చారు. దేశం ప్రస్తుతం అంతర్గత సాయుధ ఘర్షణలను ఎదుర్కొంటోందని ప్రకటించారు. ఈక్వెడార్‌లో శాంతిని పునఃస్థాపించే వరకు పోరాడతామని తెలిపారు. అంతకుముందు రోజే వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జైళ్ల వద్ద పెద్ద ఎత్తున సైనిక బలగాల మోహరింపునకు ఆదేశాలు జారీ చేశారు.
![Armed Men Storm Live TV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/20473556_armed_men_storm_live_tv--12.jpg)
![Armed Men Storm Live TV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/20473556_armed_men_storm_live_tv--11.jpg)
![Armed Men Storm Live TV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/20473556_armed_men_storm_live_tv--3.jpg)
![Armed Men Storm Live TV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/20473556_armed_men_storm_live_tv--13.jpg)