Imran Khan News: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హత్యకు కుట్ర జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో రాజధాని ఇస్లామాబాద్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన వ్యక్తిగత నివాసం ఉన్న బెనిగలా ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరం మొత్తం సెక్షన్ 144 విధించారు.
ఇమ్రాన్ శనివారం తన వ్యక్తిగత నివాసానికి చేరుకోనున్నారని ఆయన పార్టీ నాయకులు ఇటీవల తెలిపారు. అయితే, తమ నాయకుణ్ని చంపేందుకు కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ సమీప బంధువు హసన్ నియాజీ ఇటీవల ఆరోపించారు. ఒకవేళ ఆయనకు ఏదైనా జరిగితే.. దాన్ని పాకిస్థాన్‌పై దాడిగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతిస్పందన ఘాటుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కుట్రలో భాగమైనవారు పశ్చాత్తాపపడాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంతకుముందు 'పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)' అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆదివారం తన నివాసానికి చేరుకోనున్నారని గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌధరి వెల్లడించారు. మరోవైపు ఇస్లామాబాద్ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఇమ్రాన్ రాకపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. నిఘా సంస్థల నివేదికల ప్రకారం.. ఇమ్రాన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్ల తేలిందని ఫవాద్ ఏప్రిల్‌లో ఆరోపించారు. అందుకనే ఆయన భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసిందని తెలిపారు.
ఇవీ చదవండి: కిమ్ దూకుడు.. 35 నిమిషాల్లో 8 క్షిపణి పరీక్షలు.. నెక్స్ట్ అణు పరీక్షలే!