Afghanistan Taliban Order Women: అఫ్గానిస్థాన్‌లో బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినపుడు మహిళలందరూ తప్పనిసరిగా బుర్ఖా (మేని ముసుగు) ధరించాలని తాలిబన్ పాలకులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. కళ్లు మాత్రమే కనిపిస్తూ శరీర భాగాలన్నీ కప్పి ఉంచేలా బుర్ఖా ఉండాలని కఠినమైన షరతులు విధించారు. మానవహక్కుల కార్యకర్తలు, అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేసిన ఆందోళనలకు తగ్గట్టే తాలిబన్లు తమ అసలు రూపం క్రమంగా మళ్లీ బయటపెడుతున్నారు. 1996-2001 నాటి తాలిబన్ల కటువైన పాలన, మహిళలపై విధించిన ఆంక్షలను తాజా ఆదేశాలు మళ్లీ గుర్తుకు తెస్తున్నాయి.
'మా సోదరీమణులు హుందాగా, సురక్షితంగా ఉండాలని మేము కోరుకొంటున్నాం' అని తాలిబన్ సర్కారు తాత్కాలిక మంత్రి ఖాలిద్ హనాఫీ తెలిపారు. బయట ముఖ్యమైన పనేం లేకపోతే, మహిళలు ఇంట్లోనే ఉండటం అన్నిటికంటే ఉత్తమమని ఆదేశాల్లో పేర్కొన్నారు. 'మాకు ఇతర విషయాల కంటే ఇస్లాం సిద్ధాంతాలే ముఖ్యం' అని హనాఫీ పేర్కొన్నారు. అంతకుముందు ఇచ్చిన హామీకి విరుద్ధంగా బాలికలు ఆరో తరగతికి మించి చదవకుండా స్కూళ్లకు తాళాలు వేసిన తాలిబన్లు రాను రాను క్రూరమైన వైఖరితో అంతర్జాతీయ సమాజానికి దూరమవుతున్నారు.
ఇదీ చదవండి: మొక్కలతో వ్యాక్సిన్ తయారీ.. ఐదు కొవిడ్ వేరియంట్లకు చెక్!