కరోనా మహమ్మారి రక్తదాహం ఇంకా తీరడం లేదు. ఈ రక్కసి దాడికి గురై ప్రపంచవ్యాప్తంగా లక్షా మూడు వేల మందికిపైగా మరణించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 17 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవ్వగా... 3 లక్షల 80 వేల మందికిపైగా కోలుకున్నారు.
స్పెయిన్..
దేశంలో క్రమంగా కరోనా మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 510 మరణాలు నమోదయ్యాయి. మరో 3500 మందికిపైగా వైరస్ బారినపడ్డారు.
బ్రిటన్..
యూకేలో ఇవాళ మరో 917 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరో 5234 కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 78 వేలకు చేరువైంది. మరణాల సంఖ్య 9875కి చేరింది.
బెల్జియం..
బెల్జియంలో కొత్తగా 327 కరోనా మరణాలు, 1,351 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం మృతుల సంఖ్య 3,346కు, కేసుల సంఖ్య 28,018కి పెరిగింది.
నెదర్లాండ్స్లో ఇవాళ 132 మంది కొవిడ్ కారణంగా చనిపోయారు. మరో 1316 కేసులు నమోదుకాగా... మొత్తం బాధితుల సంఖ్య 28 వేలు దాటింది.
ఇరాన్..
ఇరాన్లో ఈ ఒక్కరోజే 125 మంది కరోనాతో మరణించారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 4,357కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 1,837 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 70,029కి చేరింది. మరోవైపు 41,947 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
పర్షియన్ నూతన సంవత్సరం వేడుకలను ఇళ్లలోనే చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రయాణాలు పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేసింది.
ఇటలీ..
కఠినంగా అమలవుతున్న లాక్డౌన్పై ఇటాలియన్ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. ఐదు వారాలుగా ఒంటరితనం అనుభవిస్తుండడానికి తోడు వేసవి ఉక్కపోత పెరగడమే ఇందుకు కారణం. దేశంలో మే 3వరకు లాక్డౌన్ అమల్లో ఉంది. దేశంలో ఇప్పటివరకు 18,849 మంది కరోనా బారినపడి మరణించారు.
ఇటలీలో అల్లకల్లోలం సృష్టించిన కరోనా... ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని అక్కడి ప్రజలు కోరుకుంతుండటం ఆందోళన కలిగించే అంశం.
ఇదీ చూడండి: కరోనా బాధితుల్లో చాలా మంది మృతికి ఇదే కారణం!