ఐరోపా దేశం బెలారస్లో మరోసారి నిరసన జ్వాలలు మిన్నంటాయి. రెండు వారాల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికలను తప్పుబడుతూ ఆందోళన బాట పట్టారు అక్కడి ప్రజలు. ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషింకో(65) అధికార దుర్వినియోగానికి పాల్పడి మరోసారి ఎన్నియ్యారని, ఆయన పదవికి రాజీనామా చేయాలని పెద్దఎత్తున ర్యాలీ చేశారు. రాజధాని మిన్స్క్లో సుమారు 20వేల మందికిపైగా నిరసనల్లో పాల్గొన్నారు.
2.5 కిలోమీటర్ల మేర ర్యాలీ..
రాజధాని మిన్స్క్ నగర కూడలి నుంచి జెండాలు, ప్లకార్డులు చేతబూని.. సుమారు 2.5 కిలోమీటర్ల మేర క్యూలో నిల్చుని అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు నిరసనకారులు. అయితే భవనంలోకి ఎవరూ చొరబడకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిపై జలఫిరంగులు, బాష్ప వాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు.

ఈ నెల ఆరంభం నుంచి జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు సుమారు 7 వేల మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని తీవ్రంగా కొట్టి గాయపరిచారన్న ఆరోపణలు రాగా... నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి.

26 ఏళ్లుగా ఆయనే..
సుమారు 95 లక్షల జనాభా కలిగిన బెలారస్లో 26 ఏళ్లుగా లుకాషింకో పాలన కొనసాగుతోంది. అయితే.. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, నిరంకుశ పాలన సాగిస్తున్నారని వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడం సహా.. కరోనా మహమ్మారి సమయంలోనూ సరైన చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు నిరసనకారులు.

ఇదీ చదవండి: అగ్రరాజ్య రాజకీయాల్లో.. మనోళ్లకే అగ్రస్థానం!