Ukraine President: రష్యాను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలను అందించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అమెరికా చట్టసభ్యులకు విజ్ఞప్తి చేశారు. రష్యా చమురు దిగుమతులపై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని కోరారు. అమెరికా చట్టసభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడిన ఆయన తనను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావచ్చని వ్యాఖ్యానించారు. ఇవే తన చివరి మాటలు కావొచ్చంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. 300 మంది అమెరికా చట్టసభ సభ్యులతో జెలెన్‌స్కీ దాదాపు గంటపాటు సంభాషించారు.
తాను రాజధాని కీవ్‌లోనే ఉన్నానని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. తమ గగనతలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటోను మరోసారి విజ్ఞప్తి చేశారు. అనంతరం మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన స్వాతంత్ర్యాన్ని వదులుకునేందుకు ఉక్రెనియన్లు సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. ఆక్రమణదారుల నుంచి మాతృభూమిని కాపాడుకుంటామని ప్రతినబూనారు.
"రష్యా దళాలతో ప్రతిఘటన ఆపడం లేదు. స్వదేశానికి వెళ్లాలని రష్యన్ సేనల ముందు ఉక్రెనియన్లు నినదిస్తూనే ఉన్నారు. ఆక్రమణదారులను మా భూభాగం నుంచి వెళ్లగొడతాం. రష్యా దళాలకు ఎదురవుతున్న నిరసన వారికి అవమానకరం. మా ఉక్రెయిన్ భూమిలో ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాం. ఉక్రెనియన్లు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. శత్రువు ప్రవేశించిన అన్ని నగరాల్లో పోరాడతాం" అంటూ జెలెన్‌స్కీ ఆవేశపూరిత ప్రసంగం చేశారు.
రష్యా 10 వేల మంది సైనికుల్ని కోల్పోయింది: ఉక్రెయిన్
ఈ సైనిక పోరులో ఇప్పటి వరకు 10,000 మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా చెప్పారు. అలాగే కొన్ని డజన్ల యుద్ధవిమానాలు, వందలాది ఆయుధ వాహనాలు సైతం రష్యా కోల్పోయిందన్నారు. ఉక్రెయిన్‌కు భారీ నష్టం జరుగుతున్నప్పటికీ.. పోరాటంలో మాత్రం వెనకడుగు వేయట్లేదని కులేబా తెలిపారు.
ఇదీ చూడండి : 'అనుక్షణం భయంతో.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం'