భారత్, తైవాన్‌లే లక్ష్యంగా డ్రాగన్ దీర్ఘకాలిక యుద్ధ సన్నాహాలు చేస్తోంది. భారత్ వైపు దాదాపు 3 వేల కిలోమీటర్ల పైనున్న వాస్తవాధీన రేఖ వెంబడి ఎక్కడపడితే అక్కడ ఆక్రమణలకు ప్రయత్నిస్తూ కవ్విస్తుండగా.. మరోవైపు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి డజన్ల కొద్దీ విమానాలను పంపిస్తోంది. ఈ చర్యల వెనుక చైనా దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయి. ఇటీవల అమెరికా రక్షణ శాఖ 'చైనా మిలటరీ పవర్ రిపోర్ట్ 2021' నివేదికను విడుదల చేసింది. దీనిలో చైనా ఓ ఆయుధ భూతంలా ఎలా పెరుగుతోంది.. వాస్తవాధీన రేఖ, తైవాన్‌లతో ఎలా వ్యవహరించనుందనే విషయాలను ప్రస్తావించారు.
అణ్వాయుధాలు.. రాకెట్ ఫోర్స్‌పై దృష్టి..!
సాంప్రదాయ సైనిక దళాలను తగ్గించుకొంటున్న చైనా.. వాస్తవానికి కొన్నేళ్ల నుంచి క్రమంగా రక్షణ బడ్జెట్‌ను పెంచుకొంటూ వస్తోంది. అణ్వాయుధాలు, రాకెట్ ఫోర్స్‌పై ఎక్కువగా దృష్టి సారించినట్లు అమెరికా నివేదిక పేర్కొంది. 2020 ఒక్క సంవత్సరమే డ్రాగన్ ప్రయోగాలు, శిక్షణ కోసం 250 బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన దేశాల్లో జరిగిన పరీక్షల సంఖ్య కంటే ఇది ఎక్కువ. వీటిల్లో నాలుగు క్షిపణులను దక్షిణ చైనా సముద్రంలోకి ప్రయోగించడం వివాదాస్పదమైంది. అంతేకాదు.. ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించే ఫోబ్స్ తరహా హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది. అంటే అంతరిక్షంలోకి వెళ్లిన క్షిపణి భూ భ్రమణాలు చేస్తూ.. ఎప్పుడైనా శత్రువుపై దాడి చేస్తుంది. డీఎఫ్17, డీఎఫ్27, డీఎఫ్41 వంటి క్షిపణులను చైనా ఇప్పటికే అభివృద్ధి చేసింది. 250 వరకు క్షిపణి బొరియల(సైలోస్)ను ఇప్పటికే నిర్మించినట్లు ఇటీవలే బహిర్గతమైంది.
700 అణువార్ హెడ్లు సిద్ధం..!
అమెరికా అంచనా ప్రకారం చైనా 2030 నాటికి 1000 అణువార్ హెడ్‌లను తయారు చేయనుంది. ఈ క్రమంలో 2027 వచ్చేసరికి 700 అణువార్ హెడ్‌లను సిద్ధం చేస్తుంది. 2027 సంవత్సరానికి సైనిక పరంగా చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ సంవత్సరం నాటికి చైనాలో సైనిక ఆధునికీకరణ పూర్తికావాల్సి ఉంది. అంటే డ్రాగన్ దళాలు తైవాన్ ఆక్రమణకు దిగినా మరో దేశం జోక్యం చేసుకొనే సాహసం చేయకూడదన్నది లక్ష్యం.
దాడి సంకేతాలు అందగానే ప్రతిదాడి చేసేలా (లాంఛ్ ఆన్ వార్నింగ్) స్ట్రాటజీపై చైనా పనిచేసే అవకాశం ఉందని అమెరికా అంచనా వేసింది. ఇటువంటి వ్యవస్థపై ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా, సోవియట్ యూనియన్‌లు పనిచేశాయి. ప్రత్యర్థుల అణువార్‌హెడ్‌లు గాల్లో ఉండగానే.. సంకేతాల ఆధారంగా పసిగట్టి ప్రతిదాడి చేయడం దీని లక్ష్యం.
విదేశాల్లో సైనిక స్థావరాల విస్తరణ..
సైనిక శక్తి పెరిగే కొద్దీ చైనా విదేశాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని ప్రపంచంపై పట్టు బిగించే ప్రమాదం ఉంది. ఇప్పటికే జబూటిలో అమెరికా స్థావరానికి సమీపంలో చైనా స్థావరం ఏర్పాటు చేసింది. దీంతోపాటు కంబోడియా, మయన్మార్, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ, కెన్యా,సీషెల్స్, టాంజానియా, అంగోలా,తజకిస్థాన్‌లను ఈ స్థావరాల కోసం పరిశీలిస్తోంది. వీటిల్లో అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, సింగపూర్, ఇండోనేషయా వంటివి కూడా ఉండటం విశేషం.
ఓ పక్క కవ్విస్తూనే.. నింద మాత్రం భారత్‌పై..
వాస్తవాధీన రేఖ వెంట పలు చోట్ల చైనా సైన్యం ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. ముఖ్యంగా భారత్ భూభాగాల్లో చొరబాట్లను ఇందుకు ఆయుధంగా ఎంచుకొంది. వివాదాస్పద భూభాగాల్లో గ్రామాల నిర్మాణం, ఎల్‌ఏసీ వెంబడి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ అంశాలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు భారత నిర్మాణాల కారణంగానే తాము చేపడుతున్నట్లు చైనా నిందిస్తోంది. భారత్ రెచ్చగొట్టే చర్యల కారణంగానే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలను ఎల్‌ఏసీ వద్దకు తరలించినట్లు సమర్థించుకుంటోంది. తన దృష్టిలో సరిహద్దుగా భావిస్తున్న ప్రదేశాల (వాస్తవానికి అవి భారత్‌వే) నుంచి భారత దళాలు వెనక్కి తగ్గే వరకు పీఎల్‌ఏ దళాలు కొనసాగుతాయని చైనా చెబుతోంది. భారత్ వైపు మౌలిక సదుపాయాల కల్పనను అడ్డుకోవడమే దీని ఉద్దేశం.
ఇక తైవాన్‌తో సంక్షోభం తలెత్తితే భారత్ వైపు ఉన్న సరిహద్దు కూడా కీలక పాత్ర పోషిస్తుందని చైనా భావిస్తోంది. అందుకే తొలుత భారత్ వైపు సరిహద్దుపై దృష్టిపెట్టింది. దీంతోపాటు టిబెట్ సంస్కృతి ఇప్పటి వరకు పూర్తి చైనీకరణ కాలేదన్న విషయం బీజింగ్‌లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇవి కీలక సమయాల్లో సమస్యలను సృష్టించే ప్రమాదం ఉందని అంచనా వేసింది. భారత్-అమెరికా సంబంధాలు బలపడే కొద్దీ ఇబ్బందులు తప్పవని డ్రాగన్ భావిస్తున్నట్లు అమెరికా నివేదిక అంచనా వేసింది. ఇక తైవాన్‌ను ఆక్రమించే ముందు వీలైనంత వరకు ఆ దేశాన్ని దిగ్బంధించాలన్నది చైనా ఎత్తుగడగా అమెరికా నివేదిక పేర్కొంది.
ఇదీ చూడండి: 'ఆపరేషన్ సిలిగుడి'తో భారత్‌పై చైనా కొత్త కుట్రలు!