డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించిన తరువాత ప్రజలు టీకాలు వేయించుకోవాలన్న అభ్యర్ధన చాలా దేశాలలో పెరిగింది. కొవిడ్ కట్టడిలో భాగంగా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రభుత్వాలు ప్రజలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. టీకా తీసుకున్న వారికోసం కొద్ది నెలలుగా భారీగా బహుమతులనూ అందిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉచితంగా గేమింగ్ టికెట్లు, ఆహార పదార్థాలు, బీరు వంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మరికొన్ని దేశాల్లో ఏకంగా విలాసవంతమైన భవనాల వంటి ఖరీదైన బహుమతులనూ అందజేసేందుకు ముందుకు వస్తున్నాయి. అయినా కొన్ని దేశాల్లో ప్రజలు టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి అందరికీ టీకా ఇచ్చేందుకు ప్రభుత్వాలు ప్రకటిస్తున్న బహుమతుల స్థాయి రోజురోజుకూ పెరుగుతోంది.
టెస్లా కారు.. అపార్ట్మెంట్..!
వ్యాక్సిన్ తీసుకున్న తమ పౌరులకు లాటరీ పద్ధతిలో తుపాకులు, వాహనాలు, నగదును బహుమతిగా అందించేందుకు కొద్ది వారాల క్రితం అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో అధికార యంత్రాంగం నిర్ణయించింది. జూన్ 20న నుంచి ఆగస్టు 4 వరకు అమలులో ఉండనున్న ఈ లాటరీ వివరాలను ఇటీవల వెస్ట్ వర్జీనియా గవర్నర్ జిమ్ జస్టిస్ వెల్లడించారు. కానీ ఇటీవల ఈ ప్రోత్సాహకాల స్థాయి మరింత పెరిగింది. ఇక హాంకాంగ్‌లో ప్రకటిస్తున్న బహుమతులను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న పౌరులు ఏకంగా టెస్లా కారు లేదా ఓ కొత్త అపార్ట్‌మెంట్‌కు యజమాని కావచ్చు. టీకా తీసుకున్నవారికోసం బంగారం, ఖరీదైన రోలెక్స్ చేతి గడియారాలు, షాపింగ్ వోచర్లను కూడా అక్కడి సర్కారు సిద్ధం చేసింది. ఇక రష్యా.. శీతల ప్రదేశాల్లో నివసించే తమ ప్రజల కోసం మంచులో ప్రయాణించే వాహనాలను ప్రోత్సాహకాలుగా అందిస్తోంది.
నిరాసక్తతే..
అయితే ఈ ప్రోత్సాహకాలతో ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్ పెరిగిందా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లభించడంలేదు. ఒహియోలో భారీ లాటరీని ఏర్పాటు చేసినా అక్కడ టీకా తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు రాకపోవడమే ఇందుకు నిదర్శనం. కానీ హాంకాంగ్‌లో ప్రైవేటు రంగం ఆఫర్లను ప్రకటించిన తర్వాత అక్కడ గత ఏడు వారాల్లో టీకా తీసుకున్న వారి సంఖ్య రెట్టింపు అయినట్లు ఓ వార్తా సంస్థ నిర్వహంచిన సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను పెంచడంలో భాగంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాలతో పాటు ఇలాంటి బహుమతులు కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు.
ఇవీ చదవండి: