ఎలాంటి లక్షణాలు లేకుండా నమోదవుతున్న వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఈ కరోనా 2.0 నిశ్శబ్దంగా బుసలుకొడుతోందని, దాని తీవ్రత.. అనుకున్న స్థాయి కన్నా చాలా ఎక్కువ అని ఆస్ట్రేలియా పరిశోధనలు వెల్లడించాయి.
ఐసోలేషన్‌లో ఉన్న ఓ క్రూయిజ్ షిప్‌పై అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. ఇందులో ఆస్ట్రేలియాలోని మాక్వరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కూడా పాల్గొన్నారు. ఈ అధ్యయనాన్ని థోరక్స్ జర్నల్‌లో ప్రచురించారు. షిప్‌లోని 217 మంది ప్రయాణికులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం క్రుయిజ్లోని ఐదింట నలుగురికి ఎలాంటి లక్షణాలు బయటపడకుండానే వైరస్ సోకినట్టు నిర్ధరించారు.
ఫలితాలను చూసిన తర్వాత.. క్రుయిజ్ షిప్లో ఈ తరహా కేసుల విషయాన్ని తక్కువగా అంచనా వేసినట్టు పరిశోధకులు గుర్తించారు. షిప్ నుంచి దిగిన అనంతరం ప్రయాణికులను ఎప్పటిపప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించాలన్నారు.
ప్రపంచవ్యాప్తంగా.. కరోనా 2.0 బాధితుల డేటాపై అస్పష్టత నెలకొన్న విషయాన్ని పరిశోధకులు ప్రస్తావించారు.
21 రోజుల అంటార్కిటిక్ యాత్ర కోసం మార్చి మధ్య వారంలో ఈ క్రూయిజ్ షిప్.. 217 మంది ప్రయాణికులు, సిబ్బందితో అర్జెంటీనా నుంచి బయలుదేరింది. కానీ 8వ రోజే తొలి కరోనా కేసును గుర్తించారు.
నౌక ప్రయాణించిన దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. అక్కడి ప్రయాణికులను ఎక్కించుకోలేదు. శరీర ఉష్ణోగ్రతను చూసిన తర్వాతే ఇతర ప్రయాణికులను లోపలికి అనుమతించారు. ఇక క్రుయీజ్ షిప్లో శానిటైజర్లకు కొరతే లేదు. అయినప్పటికీ.. 217 మంది ప్రయాణికుల్లో 128 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు అధ్యయనం గుర్తించింది.
ఈ 128లో 24 మందికి లక్షణాలు బయటపడ్డాయని పరిశోధకులు తెలిపారు. అయితే దాదాపు 80శాతం (108) మందిలో అసలు ఎలాంటి వైరస్ లక్షణాలను గుర్తించకపోవడం ఈ పరిశోధనలోని ముఖ్యాంశమని పేర్కొన్నారు.
లక్షణాలు లేని బాధితులు ప్రపంచవ్యాప్తంగా 1 శాతమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే అది నిజం కాదని.. పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పడానికి క్రూయిజ్ షిప్‌పై చేసిన పరిశోధనే ఉదాహరణ అని పరిశోధకులు తేల్చిచెబుతున్నారు.
ఇదీ చూడండి:- 'వ్యాక్సిన్‌తో లాభం లేదు.. కరోనాతో జీవించాల్సిందే'