రక్కసి కరోనా ధాటికి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. దక్షిణాఫ్రికాలో వైరస్ కల్లోలం ఉద్ధృతంగా కొనసాగుతోంది. రష్యాలో కొవిడ్-19 మరణాల సంఖ్య 10 వేలు దాటింది. పాక్‌లోనూ వైరస్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో వైరస్ కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు 1.14 కోట్లకు చేరువలో ఉన్నాయి.
అగ్రరాజ్యంలో అలుపు లేకుండా..
అమెరికాలో కరోనాా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 45 వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 29 లక్షలు దాటింది. మరో 254 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 132,318కి చేరింది.
మరింత తీవ్రం..
బ్రెజిల్‌ను కరోనా అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే వైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అయితే కొత్తగా మరో 35 వేల మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం బాధితులు 16 లక్షలకు చేరువయ్యాహరు. మరో 1,111 మంది కొవిడ్-19తో మృతి చెందగా.. మరణాల సంఖ్య 64,365కు ఎగబాకింది.
ఒక్కరోజే 10 వేలకుపైగా..
దక్షిణాఫ్రికాలో ఒక్కరోజులోనే 10,853 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 187,977కు చేరుకుంది. ఇందులో 30శాతం రాజధాని జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా నగరాల్లోనే ఉన్నాయి. ఆఫ్రికావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 33 వేలు దాటింది.
మరణాలు 10 వేలు+
రష్యా కరోనా కేసుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరో 6,632 మంది వైరస్ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 674,515కు పెరిగింది. 168 వైరస్‌తో మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 10 వేల మార్కును దాటిసేంది.
దాయాదిపై పంజా..
- పాక్‌లో ఒక్కరోజులో 3,387మంది కొవిడ్-19 బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 225,283కు చేరింది. మరో 68మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 4,619 పెరిగింది.
- దక్షిణా కొరియాలో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత వివిధ ప్రాంతాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరో 63మందికి వైరస్ సోకింది. కాగా మొత్తం బాధితుల సంఖ్య13,030కు పెరిగింది. ఇప్పటివరకు 283 మంది కరోనాతో చనిపోయారు.
ఇదీ చూడండి: 'ఏదైనా జరగొచ్చు.. అన్నింటికీ సిద్ధంగా ఉండండి'