ముంబయిలో మారణహోమం సృష్టించిన 26/11 దాడుల్లో తమ దేశానికి చెందిన 11 మంది ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు ఎట్టకేలకు పాకిస్థాన్ అంగీకరించింది. ఈమేరకు పాకిస్థాన్ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ ప్రకటించిన 1210 మంది హై ప్రోపైల్ ఉగ్రవాదుల జాబితాలో వీరి పేర్లను చేర్చింది. అయితే ముంబయి దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హఫీజ్ సయిద్, జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్, దావూద్ ఇబ్రహీం పేర్లు మాత్రం జాబితాలో పాక్ అధికారులు చేర్చలేదు.
మసూద్ అజార్, హఫీజ్ సయిద్‌ను ఐక్యరాజ్య సమితి ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చగా.. ఎఫ్ఐఏ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో వారు లేకపోవడం.. మరోసారి పాకిస్థాన్ కపటనీతి బయటపడింది.
పాకిస్థాన్ అధికారిక సమాచారం ప్రకారం.. ముంబయి దాడుల్లో 11మంది ఉగ్రవాదులు పాల్గొన్నారనీ.. వారిలో ముల్తాన్‌కి చెందిన అమ్జద్ ఖాన్, అల్ ఫౌజ్ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కరాచీ నుంచి సముద్రమార్గంలో ముంబయి చేరేందుకు కావాల్సిన రబ్బరు బోట్లు, లైఫ్ జాకెట్లను వీళ్లు కొనుగోలు చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఈ 11మంది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారు కాగా.. వీరంతా యూఎన్ ఉగ్ర జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు.
గత నెలలో జరిగిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో పాకిస్థాన్ మళ్లీ గ్రే లిస్టులోనే ఉండటంతో.. ఆర్థిక ఆంక్షలను తప్పించుకునేందుకే ఈ జాబితాను పాక్ ప్రకటించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
తిరస్కరించిన భారత్..
పాకిస్థాన్ విడుదల చేసిన తాజా జాబితాను భారత్ తిరస్కరించింది. భయంకరమైన ఉగ్రదాడికి సూత్రధారి, ముఖ్య కుట్రదారులను ఈ జాబితాలో పాక్ విస్మరించిందని పేర్కొంది. ముంబయి ఉగ్రదాడుల విచారణలో అంతర్జాతీయ బాధ్యతలను నిర్వర్తించటంలో అస్పష్టమైన, కుట్రపూరిత వ్యూహాలను పాకిస్థాన్ వదులుకోవాలని భారత్ పదే పదే సూచించినట్లు గుర్తు చేశారు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ. పాక్ తాజా జాబితా ప్రకారం 19 మంది ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోందన్నారు. ముంబయి దాడులు పాక్‌లో నుంచే ప్రణాళిక చేసి, అమలు చేశారనేది వాస్తవమన్నారు. దీనికి సంబంధించిన కుట్రదారులు, ఉగ్రమూకల అవసరమైన సమాచారం, ఆధారాలు పాక్ వద్ద ఉన్నాయని తాజా జాబితా ప్రకారం స్పష్టంగా తెలుస్తోందన్నారు శ్రీవాస్తవ.
ఇదీ చూడండి: పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ- మళ్లీ గ్రే జాబితాలోనే