తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను (Taliban Afghanistan) ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశం విడిచి వచ్చిన 200 మంది పౌరులను (afghanistan refugees) పాకిస్థాన్ బహిష్కరించింది. అఫ్గాన్‌లోని కుందుజ్ రాష్ట్రానికి చెందిన వీరంతా తాలిబన్లకు భయపడి వివిధ సరిహద్దు పాయింట్ల గుండా పాకిస్థాన్‌లోకి వచ్చారు. కొంతకాలం ఓ రైల్వే స్టేషన్లో తలదాచుకున్నారు. ఎక్కువ రోజులు ఉండేందుకు అధికారులు అనుమతించని నేపథ్యంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం రెండు రోజుల క్రితం వీరు క్వెట్టా రాష్ట్రంలోని (Quetta Pak Afghan) బలేలీకి చేరుకున్నారు. అయితే, అధికారులు మాత్రం అక్కడ ఉండేందుకు అనుమతించలేదు. కస్టడీలోకి తీసుకొని.. అఫ్గాన్‌కు తిరిగి పంపించారు. ఈ విషయాన్ని డాన్ పత్రిక వెల్లడించింది.
మహిళలు చిన్నారులు సైతం..
వెనక్కి పంపిన వారిలో 200 మందికి పైగా అఫ్గాన్ పౌరులు ఉన్నారని పత్రిక తెలిపింది. ఇందులో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నట్లు పేర్కొంది. పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు వారిని దేశ బహిష్కరణ (afghan refugees deported from Pakistan) చేశామని క్వెట్టా డివిజన్ కమిషనర్ సోహెయిల్ ఉర్ రెహ్మాన్ బలోచ్ తెలిపారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చేంతవరకు పాక్‌లోకి అక్రమంగా చొరబడే ప్రతి అఫ్గాన్ పౌరుడిని వెనక్కి పంపిస్తామన్నారు.
సరైన వీసా, ధ్రువపత్రాలు లేనిదే అఫ్గాన్ పౌరులను పాకిస్థాన్.. దేశంలోకి రానివ్వడం లేదు. అఫ్గాన్ శరణార్థుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. బలూచిస్థాన్‌లోని ఏ ప్రాంతంలోనూ వసతులు కల్పించడం లేదు. అయితే, అఫ్గాన్‌లోని హెల్మండ్ రాష్ట్రం నుంచి పాక్‌లోని నోష్కి జిల్లాకు పలు అఫ్గాన్ కుటుంబాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు 30 లక్షల మంది అఫ్గాన్ పౌరులకు పాకిస్థాన్ (Afghanistan refugees in Pakistan) ఆశ్రయం కల్పించింది. ఇంతకుమించి శరణార్థులను తాము దేశంలోకి అనుమతించే పరిస్థితుల్లో లేమని తెలిపింది.
ఇదీ చదవండి: మా పాలన ఇలా ఉంటుంది... తాలిబన్ల కీలక ప్రకటన