భారత్‌తో నెలకొన్న విభేదాలను తగ్గించేందుకు నేపాల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేయనున్నారని సమాచారం. 73వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీకి శుభాకాంక్షలు తెలిపి, ధ్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని..ఆ దేశ మీడియా వెల్లడించింది.
భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ ఇటీవల కొత్త మ్యాప్‌ను రూపొందించి.. పార్లమెంటులో ఆమోదింపుజేసుకుంది ఓలీ ప్రభుత్వం. దాంతో ఇరు దేశాల మధ్య వివాదం తలెత్తింది. నేపాల్ నిర్ణయాన్ని భారత్ ఖండించింది.
అంతకుముందు మే 8న ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు ప్రాంతాలైన లిపులేఖ్, ధర్చులా ప్రాంతాల గుండా వెళ్లే 80 కిలోమీటర్ల రహదారిని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. దీంతో భారత్-నేపాల్ మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి: భారత్-నేపాల్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం!