చైనాలో జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ... ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నడుం చుట్టూ బాణసంచా కట్టుకుని బెదిరించాడు. తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవాలనుకుంటే... రద్దు చేశారంటూ అధికారుల ముందు వాపోయాడు.
అంతా కరోనా వల్లే...
చోంగ్‌కింగ్‌కు చెందిన 59 ఏళ్ల వాంగ్... తన పుట్టినరోజునాడు స్నేహితులకు, బంధువులకు మంచి విందు ఇద్దామనుకున్నాడు. సుమారు 40-50 మందిని ఆహ్వానిద్దామనుకున్నాడు.
అయితే... రాకాసి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా వేడుకలను నిషేధించింది చైనా ప్రభుత్వం. ఈ విషయాన్నే వాంగ్‌కు వివరించారు గ్రామ కమిటీ సభ్యులు.
వేడుక రద్దుతో పట్టరాని ఆగ్రహానికి గురయ్యాడు వాంగ్. పొట్ట చుట్టూ టపాసులు కట్టుకుని, పెట్రోల్ డబ్బాతో గ్రామ కమిటీ కార్యాలయానికి వెళ్లాడు. విందు నిర్వహణకు అనుమతి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ... శరీరంపై పెట్రోల్ పోసుకుని బెదిరించాడు. గ్రామ కమిటీ సభ్యులు అతడ్ని అడ్డుకున్నారు. పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
చైనాలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 1100 మందికిపైగా మృతి చెందారు. మరో 44,600 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనావ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం.
ఇదీ చదవండి: ముద్దుల పోటీకి అదిరే రెస్పాన్స్.. గంటపాటు ఆగకుండా...