చైనా ప్రభుత్వం.. హాంకాంగ్ కోసం రూపొందించిన వివాదాస్పద 'జాతీయ భద్రత చట్టం' అమల్లోకి వచ్చింది. పోలీసులు మరుక్షణమే స్పందించి బుధవారమే తొలిసారిగా నిరసనకారులపై నూతన చట్టం కింద కొరడా ఝళిపించారు. తమ స్వాతంత్య్రాన్ని హరించవద్దని డిమాండ్ చేస్తూ జెండాలు చేతపట్టిన 300 మందికి పైగా ప్రజల్ని అరెస్టు చేశారు. ఇలాంటి నిరసనలు వ్యక్తం చేయడమంటే కొత్త చట్టం కింద నేరమే. బాష్పవాయువును, మిరియాల ఘాటుతో నిండిన గోళాలను పోలీసులు ప్రయోగించినా వెనుదిరగకుండా వేలాదిమంది కదం తొక్కారు. పాక్షిక స్వయం ప్రతిపత్తి ఉన్న హాంకాంగ్‌పై ఈ చట్టాన్ని చైనా రుద్దడంపై భిన్నాభిప్రాయాలున్నాయి.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సంతకం చేయడంతో నూతన చట్టం మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. 24 గంటల్లోపే దాని ప్రకారం పెద్దఎత్తున అరెస్టులు మొదలుకావడం విశేషం. 'తీవ్ర నేరాల'కు పాల్పడినవారికి గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించే వీలుంది. బ్రిటిష్ పాలన నుంచి విడివడినప్పుడు 'హాంకాంగ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతం' ప్రజాస్వామ్యం కోసం 50 ఏళ్ల కాలానికి హామీ ఇచ్చి సరిగ్గా 23 ఏళ్లకే దానిని కాలరాశారంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరసనల్లో ఎవరైనా ఆస్తుల విధ్వంసానికి పాల్పడితే వారిని ఉగ్రవాదులుగా పరిగణించి విచారించనున్నారు. చైనా నుంచి హాంకాంగ్ విడిపోవాలని గానీ, టిబెట్ స్వాతంత్య్రం కోసం గానీ గళమెత్తేవారిని చట్ట వ్యతిరేకులుగా భావిస్తామని పోలీసులు హెచ్చరించారు.
ప్రతీకారం తప్పదు: అమెరికా
వివాదాస్పద భద్రత చట్టాన్ని హాంకాంగ్‌పై చైనా రుద్దిన బుధవారం ఒక దుర్దినంగా మిగులుతుందని అమెరికా వ్యాఖ్యానించింది. దీనికి తగిన ప్రతీకార చర్యను చైనా ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో హెచ్చరించారు.
ఇదీ చూడండి:ఆశలన్నీ వ్యాక్సిన్‌పైనే.. 6 నెలలైనా అంతు చిక్కలే!