చైనాలో వరదల బీభత్సానికి మరణించిన వారిసంఖ్య 33కు చేరింది. మరోఎనిమిది మంది గల్లంతయ్యారు. ఐఫోన్ సహా వివిధ పరిశ్రమలకు నిలయమైన హెనన్ ప్రావిన్స్‌లోగత వెయ్యేళ్లలో ఎన్నడూ కురవనంత వర్షం కురిసింది. ఎల్లో నది ఉగ్రరూపం దాల్చింది. వరదలు పోటెత్తాయి. ప్రావిన్స్‌లో.. దాదాపు అన్ని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి.
వరదల ప్రభావం హెనన్ ప్రావిన్స్‌లోని 30 లక్షల మందిపై పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. సుమారు 3 లక్షల 76 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. వరదల కారణంగా 2 లక్షల 15వేల 200 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 188.6 మిలియన్ అమెరికన్ డాలర్ల మేర ఆర్థికంగా నష్టం వాటిల్లినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది.
ఐఫోన్ సిటీగా పిలిచే హెనన్ ప్రావిన్స్ రాజధాని ఝెన్‌ఝౌలో విద్యుత్తు, మంచినీటి సరఫరా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆసుపత్రులు సైతం అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. బౌద్ధ సన్యాసుల యుద్ధ విద్యలకు నిలయమైన షావొలిన్ ఆలయం కూడా వరదలకు భారీగా దెబ్బతింది. వరద నీటిని మళ్లించడానికి హెనన్ ప్రావిన్స్‌లోని యుచువాన్ కౌంటీలో దెబ్బతిన్న యిహెతన్ ఆనకట్టను చైనా సైన్యం పేల్చివేసింది.
పాక్‌లో 14 మంది మృతి
పాకిస్థాన్ కైబర్ పంఖ్తునక్వా రాష్ట్రంలో భారీ వర్షాల ధాటికి 14మంది చనిపోగా.. మరో 26 మంది గల్లంతయ్యారు. వరదల కారణంగా రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నెలమట్టమయ్యాయి.
యెమెన్‌లో ఆకస్మిక వరదలు
యెమెన్‌లో ఆకస్మిక వరదల కారణంగా 14మంది మరణించారు. గతవారం రోజులుగా తూర్పు, దక్షిణ ప్రాంతం కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట నాశనమైంది. రోడ్లు దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి: కృత్రిమ వర్షంతో పులకరించిన దుబాయ్